Jagga Reddy: వారి ఉత్సాహం కోసమే కవితను అరెస్ట్ చేశారన్న జగ్గారెడ్డి

Jagga Reddy responds on Kavitha arrest and AP Assembly elections
  • బీజేపీ కేడర్‌లో ఉత్సాహం కోసం అరెస్ట్ చేశారన్న జగ్గారెడ్డి
  • ఇప్పుడు బీజేపీ కేడర్‌లో ఉత్సాహం వచ్చిందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్‌కు మాత్రం సానుభూతి రాలేదన్న కాంగ్రెస్ నేత
  • రాముడు దేవుడు... ఆయనను లీడర్‌గా చేయవద్దని విజ్ఞప్తి
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక కారణం ఏమిటి? అంటే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పారు. ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కవితకు ఈడీ నోటీసుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ఉందని తాను గతంలో చెప్పానని... ఇప్పుడు అరెస్ట్ వెనుక కూడా ఓ కారణం ఉందన్నారు.

కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ నిరుత్సాపడిందని (అసెంబ్లీ ఎన్నికల సమయంలో) పేర్కొన్నారు. అందుకే వారి కేడర్, కార్యకర్తలకు నమ్మకం కలిగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేశారన్నారు. ఇప్పుడు బీజేపీ కేడర్‌లో ఉత్సాహం వచ్చిందన్నారు. కానీ కవిత అరెస్ట్‌తో తమకు సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ అనుకున్నప్పటికీ వారికి మాత్రం అది రాలేదన్నారు.

రాముడు దేవుడు... ఆయనను లీడర్‌గా చేయవద్దు

శ్రీరాముడు దేవుడు అని... ఆయనను లీడర్ చేయవద్దని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. బీజేపీ వాళ్లు తమ రాజకీయ మనుగడ కోసం... బతుకుదెరువు కోసం రాముడి పేరును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 

కేసీఆర్ మాటను అంత సీరియస్‌గా తీసుకోవద్దు

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని జగ్గారెడ్డి సూచించారు. అధికారంలో ఉన్న పార్టీని కాదని ఎవరైనా ప్రతిపక్షంలోకి వెళతారా? అదేం సీరియస్ అంశం కాదన్నారు. బీఆర్ఎస్ వాళ్లే కాంగ్రెస్‌లోకి వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు.

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారని... ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం... ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తమ పాలనలో ప్రతి గొంతు తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛ ఉందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని తాము అమలు చేశామని... మిగతా వాటిని కూడా అగస్ట్ 15లోగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ.. ప్రజలు నష్టపోయిన దానిని ఈ నాలుగేళ్లలో సవరించే ప్రయత్నం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Jagga Reddy
K Kavitha
BJP
Lok Sabha Polls

More Telugu News