Suresh Raina: ఆర్సీబీని ఉద్దేశిస్తూ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు!

Suresh Raina said Teams that Partied midnight Have not Won IPL Yet
  • అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకునే జట్లు ఇంకా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదన్న మాజీ ఆటగాడు
  • రాత్రంతా పార్టీలో ఉంటే ఉదయం మ్యాచ్ ఎలా ఆడగలరని ప్రశ్నించిన రైనా
  • సీఎస్కేలో ఆ సంస్కృతి లేదు కాబట్టే 5 ట్రోఫీలు గెలిచామని వ్యాఖ్య

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఒకడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ కాలం సీఎస్కేకి ఆడిన ఈ మాజీ ఆటగాడు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

పార్టీలకు అలవాటుపడిన జట్లు మాత్రమే ఇంకా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయాయని రైనా వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ పార్టీలు చేసుకోదని, అందుకే ఆ జట్టు అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అన్నాడు. పార్టీలు చేసుకునే 2-3 జట్లు ఇంకా ఐపీఎల్ గెలవలేదని పేర్కొన్నాడు. ‘‘ మీరు ఆర్సీబీ అనుకుంటున్నారా? కాదు. నా ఉద్దేశం అదికాదు. ట్రోఫీ గెలవని కొన్ని జట్ల గురించి మాట్లాడుతున్నాను’’ అంటూ నవ్వుతూ రైనా చెప్పాడు. ఆయా జట్లు ఇంకా కష్టపడి ఆడాలని సూచించాడు. హిందీ మీడియా సంస్థ ‘లలన్‌టోప్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు.

కొన్ని ఫ్రాంచైజీలు అర్ధరాత్రి పార్టీలు జరుపుకునే సంస్కృతిని కొనసాగిస్తున్నాయని, ఇలాంటి పోకడలతో జట్లు ఐపీఎల్‌ ట్రోఫీలను ఎలా గెలుస్తాయని రైనా ప్రశ్నించాడు. ‘‘ రాత్రి వరకు పార్టీలు చేసుకుంటే ఉదయం ఎలా ఆడతారు? మే-జూన్ నెలల్లో ఎండలు ఉంటాయి. రాత్రంతా పార్టీ చేసుకుంటే మధ్యాహ్నం ఆట ఎలా ఆడతారు?’’ అని రైనా పేర్కొన్నాడు. ఐపీఎల్ ట్రోఫీని ఇంకా గెలవని జట్లపై ప్రశ్నించగా రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే టీమ్‌లో తాము పార్టీలు చేసుకోలేదని, అందుకే తాము 5 ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలిచామని అన్నాడు. ముంబై ఇండియన్స్ కూడా 5 ట్రోఫీలను గెలుచుకుందని ప్రస్తావించాడు.

అర్థరాత్రి వరకు జట్టంతా పార్టీలు చేసుకోవడం మంచిది కాదని, తాను కూడా టీమిండియా తరపున ఆడాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైనా అన్నాడు. తాను రాణించకపోతే కెప్టెన్ ఎందుకు జట్టులోకి తీసుకుంటాడని రైనా ప్రశ్నించాడు. రిటైర్ అవడంతో ప్రస్తుతం తాను ఖాళీగా ఉన్నానని, ఇప్పుడు పార్టీలు చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు. రైనా ప్రస్తుతం ఐపీఎల్ 2024లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలావుండగా ఐపీఎల్‌లో బలమైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పార్టీలకు దూరంగా ఉంటుంది. టోర్నీ ముగిసే వరకు ఎలాంటి పార్టీలు పార్టీలు నిర్వహించకూడదనే నిబంధనను ఆ జట్టు ఆటగాళ్లు పాటిస్తున్నారు. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఆడుతున్నా ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలుచుకోలేకపోయాయి.

  • Loading...

More Telugu News