RBI Ex Governor: ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

  • మోదీ సర్కారుకు ఆర్బీఐ మాజీ గవర్నర్ డిమాండ్
  • ఉచిత హామీలకు అయ్యే ఖర్చుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన
  • ఈ విషయంలో రాజకీయ పార్టీలపై కొంత నియంత్రణ అవసరమని వ్యాఖ్య
  • ఉచితాలకు పెట్టే డబ్బును మరింత ప్రయోజనకరంగా వాడొచ్చని వెల్లడి
Govt Needs To Bring Out White Paper On Freebies Says RBI Ex Governor D Subbarao

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై వివరణాత్మక చర్చ జరగాల్సి ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి  సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఉచిత హామీల అమలుకు వెచ్చించే సొమ్మును మరింత ప్రయోజనకరంగా ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఉచిత హామీలు, వాటి అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడిన భారం.. తదితర వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని డి సుబ్బారావు డిమాండ్ చేశారు.

ఎన్నికలవేళ ఎడాపెడా ఉచిత హామీలు గుప్పించకుండా రాజకీయ పార్టీలపై కొంత నియంత్రణ పెట్టేందుకు ఓ వ్యవస్థ అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ పేర్కొన్నారు. ఈ విషయంలో సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ లాంటి పేద దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వమే కొన్ని కనీస సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఓటర్లపై ఉచిత హామీలు గుమ్మరిస్తున్నాయని డి సుబ్బారావు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక తామిచ్చిన ఉచిత హామీల అమలుకు అప్పులు చేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటి అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఆర్ఎంబీ) పరిమితులను దాటేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అని ఆర్బీఐ మాజీ గవర్నర్ గుర్తుచేశారు. ఆర్థిక వృద్ధి రేటును ఏటా 7.6 శాతం కొనసాగించగలిగితే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన చెప్పారు.

అయితే, ఈ గ్రోత్ రేట్ ను కొనసాగించడం కష్టమని, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, గ్లోబలైజేషన్, జియోపాలిటిక్స్ తదితర అవరోధాలను ఎదుర్కొంటూ గ్రోత్ రేట్ ను స్థిరంగా 7.6 శాతం వద్ద కొనసాగించడం చాలా కష్టమని చెబుతూ.. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, పట్టుదలగా ప్రయత్నిస్తే తప్ప సాధ్యం కాదని వివరించారు. పొరుగు దేశం చైనా ఈ వృద్ధి రేటును కొనసాగిస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉదాహరణగా చూపించారు.

More Telugu News