johnson and johnson: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ తో క్యాన్సర్ వచ్చిందన్న బాధితురాలికి రూ. 375 కోట్ల పరిహారం!

  • 70:30 నిష్పత్తిలో కంపెనీలు పరిహారం చెల్లించాలని షికాగో కోర్టు ఆదేశం
  • తన క్యాన్సర్ కు ఆ కంపెనీ పౌడర్లే కారణమని కోర్టుకెక్కిన మహిళ
  • 2020లో బాధితురాలి మృతి.. న్యాయ పోరాటం చేసిన ఆమె కుటుంబం
Johnson Johnson To Pay Millions To Woman Who Blamed Baby Powder For Cancer

అమెరికా దిగ్గజ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్, కెవెన్యూ ఇన్ కార్పొరేటెడ్ కు షికాగోలోని కోర్టు భారీ షాకిచ్చింది. ఆ కంపెనీల బేబీ పౌడర్లు వాడటం వల్ల క్యాన్సర్ బారిన పడి మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి ఏకంగా రూ. 375 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దాదాపు పదేళ్లపాటు సాగిన కేసులో సుదీర్ఘ వాదనల తర్వాత ఈ మేరకు తీర్పు చెప్పింది.

మరణానికి ఆ కంపెనీలదే బాధ్యత..
షికాగో కోర్టులో వాదనలు విన్న జడ్జీలు తెరీసా గార్షియా అనే మహిళ క్యాన్సర్ బారినపడి 2020లో మృతి చెందడానికి 70 శాతం బాధ్యత కెన్వ్యూదేనని తేల్చారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం జే అండ్ జే, కెన్వ్యూ పూర్వ సంస్థ కూడా క్యాన్సర్ కలిగించే యాస్బెస్టోస్ ఉన్న టాల్కం బేబీ పౌడర్లను విక్రయించాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. ఆ మహిళ మరణానికి మిగిలిన 30 శాతం బాధ్యత జే అండ్ జేతోపాటు దాని అనుబంధ సంస్థ తీసుకోవాలని ఆదేశించింది.

వాదోపవాదనలు..
అంతకుముందు వాదనల సందర్భంగా జాన్సన్ అండ్ జాన్సన్ తమ టాల్కం ఆధారిత ఉత్పత్తులు క్యాన్సర్ కలిగించవని చెప్పుకొచ్చింది. తాము బేబీ పౌడర్ ను దాదాపు వందేళ్లుగా మార్కెటింగ్ చేశామని వివరించింది. అలాగే తాము ఆర్థికంగా దివాలా తీశామని కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించింది. అయితే జే అండ్ జే దివాలా వాదనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టు తీర్పు పట్ల గార్షియా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. టాల్కం ఆధారిత పౌడర్ వల్ల క్యాన్సర్ సోకదన్న ఆ రెండు కంపెనీల మోసానికి కోర్టు తెరదించిందని వ్యాఖ్యానించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై కెన్వ్యూ సంస్థ వెంటనే స్పందించలేదు. కానీ జే అండ్ జే సంస్థ స్పందిస్తూ ఈ తీర్పును తాము పై కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. గతంలో ఈ తరహా కోర్టుకెక్కిన 17 కేసులకుగాను 16 కేసుల్లో తాము విజయం సాధించామని గుర్తుచేసింది. తాము విక్రయించిన టాల్కం పౌడర్ సురక్షితమేనని కోర్టులు గతంలో తేల్చాయని పేర్కొంది.

నిలిచిన టాల్కం ఆధారిత పౌడర్ విక్రయాలు
ప్రస్తుతం ఈ బేబీ పౌడర్ ను విక్రయిస్తున్న కెన్వ్యూ కు చెందిన అధికారులు తాము టాల్కం ఆధారిత పౌడర్ విక్రయాలను నిలిపేశామని తాజాగా వెల్లడించారు. మరోవైపు జే అండ్ జే సైతం గతంలో ఇదే తరహా ప్రకటన చేసింది. 2020కల్లా ఉత్తర అమెరికా మార్కెట్ల నుంచి టాల్కం ఆధారిత బేబీ పౌడర్లను ఉపసంహరిస్తామని.. 2023 డిసెంబర్ కల్లా ప్రపంచ మార్కెట్లన్నింటిలో టాల్కం బదులు మొక్కజొన్న గంజి కలిపిన పౌడర్లను విక్రయిస్తామని ప్రకటించింది.
 


  • Loading...

More Telugu News