PM Modi Bengalore: టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చారు.. బెంగళూరు నీటి కరువుపై ప్రధాని మోదీ

PM Says Congress Turned Tech City Into Tanker City
  • కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డ ప్రధాని
  • దేశాన్ని అన్నిరంగాల్లో గ్లోబల్ హబ్ గా మారుస్తానని హామీ
  • ఇండియా కూటమికి మాత్రం మోదీని తప్పించడమే లక్ష్యమని విమర్శ
టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని బెంగళూరు నీటి కటకటపై ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతూ అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపాలని మోదీ కష్టపడుతున్నాడని చెప్పారు. అయితే, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మాత్రం మోదీని తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. వరదలు, కరువుతో కర్ణాటక ఇబ్బందిపడుతుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కర్ణాటకను యాంటీ ఇన్వెస్టిమెంట్, యాంటీ ఎంట్రప్రెన్యూర్‌‌ షిప్, యాంటీ ప్రైవేట్ సెక్టార్, యాంటీ టాక్స్ పేయర్, యాంటీ వెల్త్ క్రియేటర్ గా కాంగ్రెస్ సర్కారు తీర్చిదిద్దిందని విమర్శించారు. అయితే, మోదీ మాత్రం దేశాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా, ఫార్మా హబ్ గా, ఎలక్ట్రానిక్స్ హబ్ గా, ఎలక్ట్రికల్ వెహికల్ హబ్ గా, గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, తద్వారా ఇండియాను గ్లోబల్ ఎకానమీ హబ్ గా మార్చాలని కష్టపడుతున్నాడని వివరించారు.

దేశంలో ఇప్పటికే 5జీ అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే 6జీ తీసుకొస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. దేశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తామని మోదీ హామీ ఇస్తుంటే ప్రతిపక్షాల కూటమి మాత్రం మోదీని తొలగిస్తామని చెబుతోందని, చంద్రయాన్ ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతీయులు గర్వించేలా చేస్తానని మోదీ హామీ ఇస్తుంటే.. ఇండియా కూటమి నేతలు మాత్రం మోదీని తొలగిస్తామని హామీ ఇస్తున్నారని విమర్శించారు.

కర్ణాటక రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు జనతాదళ్ సెక్యులర్ (జేడీయూ), బీజేపీ కలిసి పనిచేస్తాయని మోదీ చెప్పారు. ‘మీ కలలను సాకారం చేస్తామని నేను గ్యారంటీ ఇస్తున్నా.. నా జీవితాన్ని మీకోసం, దేశం కోసమే అంకితం చేశా’ అంటూ మోదీ కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చారు.
PM Modi Bengalore
Karnataka
Tech city
Tanker City
Siddaramaiah
BJP
Congress

More Telugu News