SRH: ఢిల్లీ ఆరంభం అదిరినా... ఎదురులేని సన్ రైజర్స్

  • ఐపీఎల్ తాజా సీజన్ లో వరుసగా నాలుగో విజయం సాధించిన సన్ రైజర్స్
  • నేడు ఢిల్లీపై 67 పరుగుల తేడాతో విజయం
  • మరోసారి రికార్డు స్కోరు సాధించిన సన్ రైజర్స్
  • మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు 
  • లక్ష్యఛేదనలో 199 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ క్యాపిటల్స్
SRH beat DC by 67 runs

ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ కూడా రికార్డు స్థాయిలో 250కి పైగా స్కోరు చేసిన సన్ రైజర్స్... ఢిల్లీ క్యాపిటల్స్ పై 67 పరుగుల తేడాతో ఘనంగా నెగ్గింది. 

ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46) మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, మిడిలార్డర్ లో షాబాజ్ అహ్మద్ (59 నాటౌట్), నితీశ్ రెడ్డి (37) రాణించారు. అనంతరం, 267 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. 

భారీ లక్ష్యమే అయినప్పటికీ, ఢిల్లీ జట్టు తన ఇన్నింగ్స్ ను దీటుగా ఆరంభించింది. తొలి ఓవర్లో పృథ్వీ షా వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి హడలెత్తించాడు. అదే ఓవర్లో పృథ్వీ షా (16) అవుట్ కాగా, డేవిడ్ వార్నర్ (1) రెండో ఓవర్ లో వెనుదిరిగాడు. అయితే జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ స్వైరవిహారం చేయడంతో, సన్ రైజర్స్ శిబిరంలో ఆందోళన నెలకొంది. 

మెక్ గుర్క్ కేవలం 18 బంతుల్లోనే 65 పరుగులు చేయడం విశేషం. అతడు 5 ఫోర్లు, 7 సిక్సర్లతో సన్ రైజర్స్ బౌలర్లను చితకబాదాడు. మరో ఎండ్ లో అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 42 పరుగులు చేశాడు. మెక్ గుర్క్ జోరుతో 7 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 100 దాటింది. ఛేదనలో ఢిల్లీ దూసుకెళుతున్నట్టే కనిపించింది. 

కానీ సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే మెక్ గుర్క్, పోరెల్ లను అవుట్ చేయడంతో మ్యాచ్ సన్ రైజర్స్ వైపు మొగ్గింది. కెప్టెన్ రిషబ్ పంత్ పోరాడినా ఫలితం లేకపోయింది. పంత్ 44 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మయాంక్ మార్కండే 2,  నితీశ్ రెడ్డి 2, వాషింగ్టన్ సుందర్ 1, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు. 

కాగా, టోర్నీలో సన్ రైజర్స్ కు ఇది వరుసగా నాలుగో విజయం. ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సన్ రైజర్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 25న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సొంతగడ్డ హైదరాబాదులో ఆడనుంది.

More Telugu News