Errabelli: అలా చేయకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని రేవంత్ రెడ్డికి రాసిచ్చే దమ్ముందా?: ఎర్రబెల్లి దయాకరరావు

Errabelli Challenges Revanth Reddy
  • వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయని వెల్లడి
  • రుణమాఫీపై రేవంత్ రెడ్డి మాట మార్చారని ఎర్రబెల్లి దయాకర రావు విమర్శ
  • హామీల అమలుకు గడువు పెట్టడాన్ని చూస్తే, ఎన్నికలు దాటవేయాలనే ఆలోచన కనిపిస్తోందని విమర్శ
దమ్ముంటే అగస్ట్‌లో రుణమాఫీ చేయాలని, లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసివ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ... వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. హామీల అమలుకు రేవంత్ రెడ్డి ఆగస్ట్ వరకు గడువు పెట్టడాన్ని బట్టి చూస్తే, ఎన్నికలు దాటవేయాలనే ఆలోచన కనిపిస్తోందన్నారు.

అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి ఆగస్ట్ నెలకు వాయిదా వేశారని మండిపడ్డారు. ఆగస్ట్ నాటికి ఎన్నికలు పూర్తవుతాయని, ఇక అప్పుడు ప్రజలకు ఏం చెప్పినా నడుస్తుందనే ఆలోచన కనిపిస్తోందన్నారు. అగస్ట్‌లో రుణమాఫీ చేయకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని చెప్పగలడా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి బాండ్లు రాసివ్వడం కొత్తకాదని, ఎన్నికల సమయంలో రాసిచ్చిన బాండ్ల అడ్రస్‌ ఎక్కడ? అని ప్రశ్నించారు. పంటకు రూ.500 పంట బోనస్‌ ఇచ్చారా? అని నిలదీశారు.

రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారుల నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు తరలిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. ప్రజలు కేసీఆర్‌ను ఓడించినందుకు బాధపడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎవరి చేయి పడినా ఉరికించి కొట్టాలన్నారు. మనవారిపై అక్రమ కేసులు పెడితే మీ వద్దకు వచ్చి కొట్లాడుతానని... కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.
Errabelli
BRS
Revanth Reddy

More Telugu News