Manish Sisodia: మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

No bail for Manish Sisodia today court reserves decision for April 30
  • గుజరాత్ లో ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరిన సిసోడియా
  • బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వెల్లడి
  • ఈ నెల 30న తీర్పు ఇస్తామన్న న్యాయస్థానం
లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎక్సైజ్ కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు శనివారం ఊరట లభించలేదు. ఆయన పిటిషన్ పై తీర్పును కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. గుజరాత్ లో పార్టీ లోక్ సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సిసోడియా కూడా ఉన్నారు. ఈ జాబితాలోని ఇతర స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో ఇదే కేసులో జైలుపాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కూడా ఉన్నారు.

అవినీతిపై మన్మోహన్ వ్యాఖ్యల ప్రస్తావన
అంతకుముందు వాదనల సందర్భంగా సిసోడియా బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించింది. సమాజమంతా ఆర్థిక నేరాల వల్ల బాధపడుతోందని పేర్కొంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటనను ఉదహరించింది. ‘సమాజానికి పట్టిన క్యాన్సర్ అవినీతి’ అంటూ మన్మోహన్ పేర్కొనడాన్ని గుర్తుచేసింది. “సిసోడియాకు ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే తదుపరి దర్యాప్తును, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ దశలో బెయిల్ ఇస్తే నిందితుడి ఉద్దేశం కచ్చితంగా నెరవేరుతుంది” అని సీబీఐ కోర్టులో వాదించింది. అంతకుముందు సిసోడియా పిటిషన్ కు బదులివ్వాలని ఈడీ, సీబీఐకి కోర్టు ఈ నెల 12న నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20లోగా నోటీసులకు బదులివ్వాలని సీబీఐ, ఈడీ ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు.

సీబీఐ, ఈడీ ఆరోపణలు ఇవీ..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని సవరించే క్రమంలో ఎన్నో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. మద్యం లైసెన్స్ దారులకు అనుచిత లబ్ధి జరిగిందని వాదించాయి. లైసెన్స్ ఫీజు మాఫీ లేదా తగ్గింపు, సరైన అధికారి అనుమతి లేకుండానే లైసెన్సుల గడువు పొడిగింపు వంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నాయి. ఇలా చట్టవిరుద్ధంగా పొందిన లాభాలను లబ్ధిదారులు కుమ్మక్కయిన అధికారులకు బదిలీ చేశారని సీబీఐ, ఈడీ చెప్పాయి. ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ఖాతా పుస్తకాల్లో తప్పుడు ఎంట్రీలు నమోదు చేశాయని ఆరోపించాయి. 
Manish Sisodia
bail petition
court
AAP
leader

More Telugu News