Kenya Military Chief: హెలికాప్టర్ కూలిన ఘటనలో కెన్యా మిలిటరీ చీఫ్ దుర్మరణం

Kenyas military chief among 10 people killed in helicopter crash
  • ఎల్గెయో మారాక్వెట్ కౌంటీలో గురువారం మధ్యాహ్నం కూలిన హెలికాఫ్టర్
  • మిలిటరీ చీఫ్ ఫ్రాన్సి్స్ ఒగొల్లాతో పాటు మరో తొమ్మిది మంది దుర్మరణం
  • ప్రమాదం నుంచి బయటపడ్డ ఇద్దరు సైనికులకు చికిత్స
  • మిలిటరీ చీఫ్ మృతిపై కెన్యా అధ్యక్షుడి సంతాపం

హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం చెందారు. ఆయనతో పాటు హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న మరో తొమ్మిది మంది కూడా అసువులు బాసారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.20 గంటలకు రాజధాని నైరోబీకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్గెయో మారాక్వెట్ కౌంటీలో హెలికాఫ్టర్ క్రాష్ అయ్యింది. వాయవ్య కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. 

మిలిటరీ చీఫ్ మరణంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో విచారం వ్యక్తం చేశారు. కెన్యా ఓ ధైర్యవంతుడైన సైనిక జనరల్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కూడా ఘటనా స్థలానికి పంపించామని తెలిపారు. ఒగొల్లా గతంలో కెన్యా ఎయిర్‌ఫొర్స్ అధిపతిగా ఉన్నారు. ఆ తరువాత డిప్యూటి మిలిటరీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. గతేడాది అధ్యక్షుడు రూటో ఆయనను మిలిటరీ చీఫ్‌గటా నియమించారు. 

1984లో కెన్యా మిలిటరీలో చేరిన ఒగొల్లా అమెరికాలో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ పొందారు. కొంతకాలం పాటు ఎయిర్‌ఫోర్సుకు ఇన్‌స్ట్రక్టర్ పైలట్‌గా కూడా ఉన్నారు. గతేడాది ఒగొల్లాను మిలిటరీగా చీఫ్‌గా నియమించిన సందర్భంగా అధ్యక్షుడు రూటో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 ఎన్నికల ఫలితాలు చెల్లకుండా చేసేందుకు జరిగిన కుట్రలో ఒగొల్లాకు కూడా భాగం ఉందన్నారు. అయితే, మిలిటరీ చీఫ్‌ బాధ్యతలకు ఒగొల్లాకు మించిన వారు దేశంలో లేరని కూడా వ్యాఖ్యానించారు. ఇక వాయవ్య కెన్యాలో చెలరేగుతున్న హింస కారణంగా ఇప్పటివరకూ డజన్ల సంఖ్యలో సామాన్య పౌరులు, పోలీసు అధికారులు మరణించారు.

  • Loading...

More Telugu News