Jogi Ramesh: కృష్ణా జిల్లాలో ఎక్కడ్నించి పోటీ చేసినా నేను గెలవగలను... చంద్రబాబు, పవన్ లకు మంత్రి జోగి రమేశ్ కౌంటర్

Jogi Ramesh fires on Chandrababu and Pawan Kalyan
  • నిన్న పెడనలో ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలు
  • జోగి రమేశ్ ను పెడన నుంచి పెనమలూరు పంపారని ఎద్దేవా
  • చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోలేదా అంటూ జోగి రమేశ్ వ్యాఖ్యలు
  • పవన్ గాజువాక, భీమవరం నుంచి పారిపోయాడని ఎద్దేవా 

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న కృష్ణా జిల్లా పెడనలో ప్రజాగళం సభకు హాజరై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్ పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి జోగి రమేశ్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. తనను పెడన సీటు నుంచి పెనమలూరుకు బదిలీ చేయడంపై చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. 

చంద్రబాబు పెడనలో నిన్న నోటికివచ్చినట్టు మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి అని, కానీ చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే హైదరాబాద్ పారిపోతారని ఎద్దేవా చేశారు. 

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం పారిపోలేదా?  పిఠాపురంలో గ్లాసు పగిలిపోతే ఇక హైదరాబాద్ వెళ్లి షూటింగులు చేసుకుంటాడని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా ఆయన నారా లోకేశ్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. మంగళగిరి ఏమైనా లోకేశ్ సొంతమా? అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో ఎక్కడ్నించి పోటీ చేసినా తాను గెలుస్తానని జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News