Japan: జపాన్ ను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు.. వీడియో ఇదిగో!

Earthquake of 6 magnitude jolts Ehime And Kochi prefectures of south Japan
  • బుధవారం అర్ధరాత్రి ఘటన.. ఊగిపోయిన భవనాలు
  • భయాందోళనలలో జపాన్ వాసులు
  • వారం పాటు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వ సూచన
జపాన్ లో బుధవారం అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భవనాలు ఊగిపోయాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4 పాయింట్లుగా నమోదైందని జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంప ప్రభావంతో ఆ తర్వాత మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని, మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. తాజా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని వివరించింది. క్యూషు, షికోకు దీవుల మధ్య ఉన్న బుంగో జలసంధిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. బుధవారం రాత్రి 11:30 గంటల (జపాన్ కాలమానం) ప్రాంతంలో ఎహిమె, కోచి ప్రిఫెక్షర్ (జిల్లాల) లో భూమి కంపించిందని అధికారులు తెలిపారు.

దీంతో పలుచోట్ల వాటర్ సప్లై పైపులు పగిలిపోయాయని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషి మీడియాకు వివరించారు. షికోకు ఎలక్ట్రిక్ పవర్ కు చెందిన ఇకాట న్యూక్లియర్ ప్లాంట్ పై భూకంప ప్రభావం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, భౌగోళిక పరిస్థితుల కారణంగా జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రతీ ఐదు భూకంపాలలో ఒకటి జపాన్ లోనే నమోదవుతుంది. జపాన్ చరిత్రలోనే అత్యంత తీవ్రతతో 2011 మార్చి 11న భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9 పాయింట్లుగా నమోదైంది.
Japan
Earthquake
south Japan
International

More Telugu News