Vangaveeti Radha: చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తరఫున ప్రచారానికి వచ్చిన వంగవీటి రాధా

Vangaveeti Radha campaigns for TDP candidate Pulivarti Nani in Chandragiri
  • చంద్రగిరి నియోజకవర్గంలో సందడి చేసిన వంగవీటి రాధా
  • ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేత పులివర్తి నాని అని వెల్లడి
  • చంద్రగిరిలో గెలిచేది పులివర్తి నాని అని స్పష్టీకరణ
  • సర్వేల కంటే ప్రజల నాడి ముఖ్యమని రాధా వ్యాఖ్యలు

విజయవాడ నేత వంగవీటి రాధా నేడు తిరుపతి జిల్లా చంద్రగిరి విచ్చేశారు. ఇవాళ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో బలిజ సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన తండ్రి దివంగత వంగవీటి రంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. పులివర్తి నానితో కలిసి బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది.

చంద్రగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నేత పులివర్తి నాని అని వంగవీటి రాధా స్పష్టం చేశారు. ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పులివర్తి నాని గెలుపు తమ గెలుపు అని భావించి కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రగిరిలో పులివర్తి నాని గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. 

సర్వేల కంటే ప్రజల మనోభావాలు ముఖ్యమని, ప్రజల నాడి ఎలా ఉందో తమకు తెలుస్తోందని, ఈసారి కూటమిదే విజయం అని రాధా స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజల్లోకి వచ్చిన వారి కంటే, నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్న వారికే ప్రజల మనోభావాలు తెలుస్తాయని అన్నారు. 

కూటమి అభ్యర్థులు గెలిచిన తర్వాత వారి విజయం కోసం సహకరించిన నేతల సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. 

"అమ్మ ఒడి ఇచ్చాం, డబ్బులు పంచేశాం అని జగన్ అంటున్నారు... కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఎక్కడ అని యువతలో ఒక అయోమయం నెలకొంది. ఇవాళ యువత ఆకాంక్షలు నెరవేర్చేది టీడీపీ-బీజేపీ-జనసేన కూటమే. కూటమి గెలిచాక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రజలు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల రోజున బ్యాలెట్ పై ఏ బటన్ నొక్కాలో ప్రజలకు తెలుసు" అని వంగవీటి రాధా స్పష్టం చేశారు.
.

  • Loading...

More Telugu News