Arun Govil: అరుణ్ గోవిల్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై దుమారం.. విరుచుకుపడుతున్న విపక్షాలు

Arun Govil remark on Constitution sparks row Opposition slams BJP
  • రాజ్యాంగంలో మార్పులు చేయాలంటూ అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్
  • ఎంపిక చేసిన బిలియనీర్ క్యాంపు కోసమేనన్న అఖిలేశ్ యాదవ్
  • బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ మార్పు తప్పదంటూ ‘రామాయణ్’ టీవీ సీరియల్ నటుడు, బీజేపీ మీరట్ లోక్‌సభ అభ్యర్థి అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాల్సిన ఆవశ్యకతపై ఆయన చర్చిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ సహా ప్రతిపక్ష నేతలు అరుణ్ గోవిల్‌పైనా, బీజేపీపైనా విరుచుకుపడుతున్నారు.  

వైరల్ అవుతున్న ఆ వీడియోలో అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో కాలానుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. మార్పు అనేది అభివృద్ధికి సంకేతం. అదేమీ చెడ్డ విషయం కాదు. ఒకప్పటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితి వేరు. కాబట్టి రాజ్యాంగంలో మార్పులు చేయాలి. ఏదో ఒక్క వ్యక్తి ఉద్దేశం కోసం రాజ్యాంగాన్ని మార్చరు. ఏకాభిప్రాయంతో మారుస్తారు 

అరుణ్ గోవిల్ వ్యాఖ్యలపై అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంపిక చేసిన బిలియనీర్ క్యాంపునకు బీజేపీ అన్ని ఫలాలు అందించాలనుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగంలో ప్రగతిశీల సవరణలు, ప్రాథమిక మార్పుల మధ్య తేడాను అర్థం చేసుకోలేని వాళ్లకు బీజేపీ టికెట్లు ఇచ్చి తప్పు చేసిందని విమర్శించారు. అయినప్పటికీ పెద్దగా తేడాలేదని, ఎందుకంటే ప్రతి బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. 

ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలోని 85 శాతం మంది దళితులు, వెనకబడిన, అణగారిన, దోపిడీకి గురవుతున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రిజర్వేషన్లకు ఇక చరమగీతం పాడతామని ఇప్పటికే లల్లూసింగ్, జ్యోతిమిర్దా, అనంత్ హెగ్డే చెప్పారని, ఇప్పుడా జాబితాల అరుణ్ గోవిల్ చేరారని ఎక్స్‌లో విమర్శించారు.
Arun Govil
Constitution
BJP
Akhilesh Yadav
Sanjay Singh
SP
AAP

More Telugu News