Stone Attack On Jagan: సీఎం జగన్ పై దాడి ఘటన పట్ల బెజవాడ సీపీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే...!

Vijayawada CP Kantirana Tata press meet over stone attack on CM Jagan
  • విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • నేడు మీడియా సమావేశం నిర్వహించిన సీపీ కాంతిరాణా టాటా
  • సీఎం పర్యటనకు తగినంత భద్రత కల్పించామని వెల్లడి
  • రూఫ్ టాప్ షో నిర్వహిస్తుంటే కరెంటు ఆఫ్ చేయడం సాధారణమేనన్న టాటా
  • సీఎంకు తగిలింది రాయేనని స్పష్టీకరణ

విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ కు విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని వెల్లడించారు. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్ల బలగాలను సీఎం భద్రతకు కేటాయించామని, వాటికితోడు ఆక్టోపస్, సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఉందని తెలిపారు. 

సీఎం ర్యాలీలో కరెంట్ ఎందుకు పోయిందని మీడియాలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని, సీఎం వంటి వ్యక్తి రోడ్ షోలో వాహనం పైకి ఎక్కి రూఫ్ టాప్ షో నిర్వహిస్తున్నప్పుడు వైర్లు తగలకుండా ఎక్కడైనా సరే కరెంటు ఆఫ్ చేస్తారని సీపీ కాంతిరాణా టాటా వివరణ ఇచ్చారు. కొన్నిచోట్ల గాలి, వర్షం కారణంగా కరెంటు తీసేశారని తెలిపారు. భద్రత కారణాల వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని, సెక్యూరిటీ ప్రొటోకాల్ లో ఇదొక భాగం అని స్పష్టం చేశారు. 

"సీఎం జగన్ రోడ్ షో విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్, గంగానమ్మ టెంపుల్ సమీపంలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి రాయి విసరడం జరిగింది. గత రెండ్రోజులుగా అక్కడ అందుబాటులో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజి చూశాం. కొందరు సెల్ ఫోన్లలో వీడియో రికార్డింగ్ చేశారు. వాటి నుంచి కూడా సేకరించిన సమాచారం ఆధారంగా, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా... ఒక వ్యక్తి బలంగా రాయి విసిరినట్టు గుర్తించాం. 

ఆ రాయి సీఎం జగన్ నుదుటిపై ఎడమ వైపున తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి గారి ముక్కుకు, కంటికి తగిలి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజి చాలా స్పష్టంగా ఉంది. మరింత స్పష్టత కోసం ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం. సీఎం జగన్ కు తగిలింది రాయి అని కచ్చితంగా చెప్పొచ్చు. 

ఈ ఘటనపై వెల్లంపల్లి గారు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించి ఐపీసీ 307 కింద కేసు నమోదు చేశాం. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించాం" అని కాంతిరాణా టాటా వివరించారు.

  • Loading...

More Telugu News