IMD: ఈసారి నైరుతి రుతుపవనాలతో వర్షాలే వర్షాలు... ఐఎండీ అంచనా

IMD predicts above normal rainfall with Southwest monsoon this season
  • భారత్ లో అత్యధిక శాతం వర్షాన్ని అందించేవి నైరుతి రుతుపవనాలు
  • ఈసారి 106 శాతం వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ
  • ఈసారి భారత్ కు లా నినా పరిస్థితులు కలిసి వస్తాయని వెల్లడి 
మరి కొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కీలక అంచనాలు వెలువరించింది. ఈ ఏడాది నైరుతి సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి సీజన్ లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా... ఆ మేరకు విస్తారంగా వర్షాలు కురిసేందుకు 106 శాతం అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ వివరించింది. 

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయి. సెప్టెంబరు మాసం రెండో వారం నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. దాదాపు నాలుగు నెలల పాటు దేశంలో అత్యధిక ప్రాంతాల్లో వర్షపాతాన్ని ఇస్తాయి. 

కాగా, 96 శాతం నుంచి 104 శాతం మధ్యన ఉంటే దాన్ని సగటు లేదా సాధారణ వర్షపాతంగా పిలుస్తారని, అంతకుమించితే దాన్ని సాధారణం కంటే అత్యధికం అంటారని ఐఎండీ స్పష్టత ఇచ్చింది. గత కొంతకాలంగా ఎల్ నినో పరిస్థితులతో క్షామ పరిస్థితులను చవిచూసిన భారత్ కు ఈసారి లా నినా పరిస్థితులు కలిసి వస్తాయని ఐఎండీ చెబుతోంది. లా నినాతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
IMD
Southwest Monsoon
Rain Fall
India
La Nina

More Telugu News