Bonda Uma: సానుభూతి కోసమే జగన్ గులకరాయి డ్రామా: బోండా ఉమ

TDP Leader Bonda Uma Maheshwar Rao Press Meet
  • మీడియా సమావేశంలో టీడీపీ నేత బోండా ఉమ
  • జగన్ సానుభూతి డ్రామాను వైసీపీ కార్యకర్తలే నమ్మట్లేదని వ్యాఖ్య
  • సీఎం పర్యటనలో కరెంట్ ఎందుకు తీశారో చెప్పాలని డిమాండ్

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై రాయిదాడి ఘటనపై టీడీపీ నేత బోండా ఉమ తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడారని మండి పడ్డారు. కోడికత్తి తరహాలోనే గులక రాయి డ్రామాకు ఎంపీ కేశినాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని ఆరోపించారు. సీఎంపై హత్యాయత్నం అని వైసీపీ నాయకులు చెబుతున్నా వైసీపీ కార్యకర్తలే నమ్మట్లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యకర్తలు ఒక్కరు కూడా జెండా పట్టుకుని వీధుల్లో నిరసన తెలపట్లేదని అన్నారు. 

కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయటపెట్టాలని కూడా బోండా ఉమ డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంకా శ్రీనుపై అనుమానాలున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. 

గతంలో ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద దాడి జరిగితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీ కన్నుకు గాయమైతే 307 సెక్షన్ నమోదు చేయలేదెందుకని ప్రశ్నించారు. సీఎంకు గులకరాయి తగిలితే 307 సెక్షన్ కింద కేసు పెట్టారన్నారు. అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. 

తాము అధికారంలోకి వచ్చాక దీని వెనక ఎవరు ఉన్నారో అసలు వాస్తవాలు బయట పెడతామని బోండా ఉమ హెచ్చరించారు. ఈ ఘటనపై సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామన్నారు. వెల్లంపల్లి కాలుకు గాయమైతే కన్నుకు ఎందుకు కట్టుకట్టారో చెప్పాలని ప్రశ్నించారు. మీడియా సమక్షంలో కంటి పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News