Vijayasai Reddy: పవన్ కల్యాణ్ నాకు బాల్యమిత్రుడు... విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

Vijayasaireddy says Pawan Kalyan was his childhood friend
  • ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
  • తనను పవన్ ఎప్పుడూ విమర్శించలేదని వెల్లడి
  • తాను అప్పుడప్పుడు రాజకీయంగా విమర్శిస్తుంటానని స్పష్టీకరణ
  • పవన్ ను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని ఉద్ఘాటన
రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్ సభ స్థానం వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 

మీరు విపక్ష నేతలు అందరినీ ఓ రేంజిలో విమర్శిస్తారు కానీ పవన్ కల్యాణ్ ను ఎందుకు విమర్శించరు? అంటూ సదరు చానల్ యాంకర్ ప్రశ్నించగా, విజయసాయిరెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ తనకు బాల్యమిత్రుడు అని సంచలన విషయం వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ తనను విమర్శించలేదని తెలిపారు. అయితే, తాను గతంలో రాజకీయ అంశాలపై పవన్ కల్యాణ్ ను, జనసేన పార్టీని విమర్శించానని విజయసాయి పేర్కొన్నారు. 

"ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సభ్యులు విజయవాడకు వచ్చినప్పుడు ఆ సమావేశానికి నేను హాజరైనప్పుడు, ఆ సమావేశం ముగిశాక బయటికొచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు జనసేనను ఏ విధంగా విమర్శించాను, పవన్ కల్యాణ్ ను ఏ విధంగా విమర్శించాను అనేది మీరు గమనించవచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజకీయంగా విమర్శించడం తప్పదు. తప్పని పరిస్థితుల్లో తప్పకుండా విమర్శించాల్సిందే. విమర్శించాల్సిన వచ్చినప్పుడు పదునైన పదజాలంతో విమర్శిస్తాం" అని స్పష్టం చేశారు. 

అయితే, చంద్రబాబును, లోకేశ్ ను విమర్శించినంత ఘాటుగా పవన్ ను విమర్శించడంలేదన్న అభిప్రాయాలు ఉన్నాయని చానల్ యాంకర్ ప్రశ్నించారు. 

అందుకు విజయసాయి స్పందిస్తూ... "అవతల పవన్ కల్యాణ్ ఉన్నా, ఇంకో రాజకీయ నాయకుడు ఉన్నా రాజకీయంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడను. పవన్ కల్యాణే కాదు, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. పార్టీలో కొందరు నాయకులు వ్యక్తిగత  విమర్శలు చేస్తుండవచ్చు కానీ, అలాంటి వాటికి నేను దూరం" అని వివరణ ఇచ్చారు.
Vijayasai Reddy
Pawan Kalyan
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News