Truong My Lan: వియత్నాంలో కోటీశ్వ‌రురాలికి మరణశిక్ష.. ఇంత‌కీ ఆమె చేసిన నేరమేంటంటే..!

Vietnam real estate tycoon Truong My Lan sentenced to death in biggest fraud case
  • దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలిన ట్రూంగ్ మై లాన్‌
  • ‘వాన్ థిన్ ఫాట్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్న మ‌హిళా బిలియనీర్
  • ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’లో మోసానికి పాల్పడిన ట్రూంగ్ లాన్‌
  • బ్యాంక్‌కు ఏకంగా 12.5 బిలియన్ డాలర్ల కుచ్చుటోపీ
వియత్నాం రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ ట్రూంగ్ మై లాన్‌కు మరణశిక్ష పడింది. ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధిస్తూ స్థానిక‌ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ‘వాన్ థిన్ ఫాట్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్న 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్.. తన నియంత్రణలోనే ఉన్న ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’లో మోసానికి పాల్పడ్డారు. ఏకంగా 12.5 బిలియన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1 లక్ష కోట్లు) దారి మళ్లించారు. ఈ మొత్తం ఆ దేశ జీడీపీలో 3 శాతం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆమెకు అక్క‌డి కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ తీర్పును వెల్ల‌డించింది. 

2012 నుంచి 2022 మధ్యకాలంలో ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’ను ట్రూంగ్ మై లాన్ చట్టవిరుద్ధంగా నియంత్రించారు. ఈ ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏకంగా 2,500 రుణాలు పొందారు. దాంతో బ్యాంకు 27 బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్టం చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఆమె డ్రైవ‌ర్ బ్యాంకు ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి 4.4 బిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దును ట్రూంగ్ లాన్‌ నివాసానికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. 

అయితే, వియత్నాంలో 2022 నుంచి అవినీతి నిరోధక చర్యలు తీవ్రమవ్వగా అదే ఏడాది అక్టోబర్‌లో ట్రూంగ్ లాన్ వ్యవహారం బయటకురావ‌డంతో ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా స్థానిక కోర్టు ఆమెను దోషిగా తేల్చి మ‌ర‌శిక్ష ఖ‌రారు చేసింది. మ‌రోవైపు 5.2 మిలియ‌న్ డాల‌ర్లు లంచం తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వియ‌త్నాం కేంద్ర బ్యాంకు మాజీ అధికారి డొ థి న్హాన్‌కు న్యాయ‌స్థానం జీవిత‌ఖైదు విధించింది. ఇదిలాఉంటే.. వియ‌త్నాంలో ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం నేల‌చూపులు చూస్తోంది. దాంతో కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షించేందుకు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌, బ‌హుమ‌తులు ప్ర‌క‌టిస్తున్నాయి.
Truong My Lan
Vietnam
Real estate tycoon
Death sentence

More Telugu News