Chandrababu: విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్యపై చంద్రబాబు స్పందన

Chandrababu responds on SPF Constable suicide incident in Vizag
  • శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న చంద్రబాబు
  • ఏపీలో పోలీసు సిబ్బందిపై రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయని వెల్లడి
  • పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని హితవు
  • కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. 

రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవం అని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా శాంతిభద్రతలు కాపాడే పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ముఖ్యంగా, కానిస్టేబుళ్ల విషయంలో సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ లీవ్ బకాయిలు ఎన్నో నెలలుగా చెల్లించాల్సి ఉందని వివరించారు. టీఏ, డీఏ బకాయిలు కూడా చెల్లించడంలేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. పీఆర్సీ ప్రకటన కూడా ఉద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. 

"పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నారు... అది అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే మొదట పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. అటు ఖాళీల భర్తీ లేదు... ఇటు వీక్లీ ఆఫ్ లేదు. పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయన్న విషయం గుర్తించాలి. ఇవి కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా తమ అవినీతికి, అరాచకాలకు సహకరించాలని పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ పోలీసులపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. 

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తాం. ఈ మేరకు పోలీసు సోదరులకు హామీ ఇస్తున్నాను" అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో  పేర్కొన్నారు.
Chandrababu
Shankarrao
SPF Constable
Suicide
Vizag
Police
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News