Zombie Drug: సమాధులు తవ్వి ఎముకలు పట్టుకుపోతున్నారు.. సియెర్రా లియోన్‌‌లో అత్యవసర పరిస్థితి.. సమాధుల వద్ద పోలీసులతో భద్రత

Sierra Leone Declares Emergency After Addicts Dig Up Graves
  • జాంబీడ్రగ్ కుష్‌కు బానిసలుగా మారిన యువత
  • కొద్దిసేపు పీల్చినా కొన్ని గంటలపాటు మత్తులోనే
  • 2018లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ‘కుష్’
  • డ్రగ్ తయారీలో మానవ ఎముకలు
  • దేశవ్యాప్తంగా సమాధులు కొల్లగొడుతున్న దొంగలు 
జాతుల వైరం, అంతర్గత కుమ్ములాటలతో ఆర్థిక సంక్షోభంతో అల్లాడే పశ్చిమాసియా దేశం సియెర్రా లియోన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జాంబీ డ్రగ్‌కు బానిసలుగా మారిన యువకులు యథేచ్ఛగా సమాధులు తవ్వి ఎముకలను పట్టుకుపోతుండడం కలకలం రేపుతోంది. దీంతో సమాధులన్నీ ఖాళీ అవుతుండడంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించింది. 

నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండడం, వ్యసనాలవైపు యువత మళ్లడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీనికితోడు 2018లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ‘కుష్’ అనే జాంబీడ్రగ్ చాపకింద నీరులా దేశమంతా పాకిపోయింది. ఈ జాంబీ డ్రగ్‌ను గంజాయి, టెంటానైల్, ట్రమడోల్ వంటి మత్తుపదార్థాలు, మనిషి ఎముకలతో తయారుచేస్తారు. దీనిని కొద్దిగా తీసుకున్నా సరే కొన్ని గంటలపాటు మత్తులో మునిగి తేలేలా చేస్తుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు అవయవాల వాపు, అంతర్గత రక్తస్రావం వంటి వాటికీ కారణం అవుతోంది. 25 ఏళ్ల లోపు ఉన్న యువత ఎక్కువ దీనికి బానిసలుగా మారుతున్నారు. దీనివల్ల ఇప్పటికే వందలాదిమంది మరణించినట్టు చెబుతున్నారు. 

ఈ డ్రగ్‌ తయారీకి అవసరమైన మానవ ఎముకలు దొరకడం కష్టంగా మారడంతో కొందరు డీలర్లు దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్వించి ఎముకలు సేకరించి డ్రగ్ తయారీదారులకు అందిస్తున్నారు. మరికొందరు యువకులు ఇళ్లలోనే గంజాయి పెంచుతూ ఎముకల కోసం సమాధులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సమాధుల వద్ద పోలీసులను కాపలాపెట్టింది. అంతేకాదు, దేశంలో అత్యయిక స్థితి విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
Zombie Drug
Kush
Sierra Leone
Human Bones
Grave Robbers

More Telugu News