Margadarsi Case: మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు... కేసు విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ

SC reverts Margadarsi case hearing to Telangana High Court
  • మార్గదర్శి కేసు విచారణను కొట్టివేస్తూ గతంలో ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తీర్పు
  • ఉమ్మడి హైకోర్టు తీర్పును నేడు కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం
  • ఆరు నెలల్లో మార్గదర్శి కేసు విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను కొట్టివేస్తూ గతంలో ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ కేసు విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. 

ఈ కేసులో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది. కేసు సాంకేతిక అంశాలను మాత్రమే తాము ప్రాతిపదికగా తీసుకున్నామని, తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లలేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

అదే సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టుకు సహకరించాలని, ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో ఆయన మీడియా ముందుకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి, ఆర్బీఐ వాదనలు వినిపించాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఈ కేసు విచారణను ఆరు నెలల్లో ముగించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. మార్గదర్శి సంస్థ డిపాజిటర్లకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందా? అనే అంశంలో నిగ్గు తేల్చడానికి ఓ మాజీ జడ్జిని నియమించాలని స్పష్టం చేసింది.
Margadarsi Case
Supreme Court
Telangana High Court
Ramoji Rao
Undavalli Arun Kumar
Andhra Pradesh

More Telugu News