Jagapathi Babu: 'గుంటూరు కారం' అందుకే దెబ్బడిపోయింది: జగపతిబాబు

Jagapathi Babu Reveals Failure Behind Guntur Kaaram Movie
  • సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండడం వల్ల గందరగోళం ఏర్పడిందన్న జగపతిబాబు
  • కొన్ని పాత్రల్లో మార్పులు చేయాల్సి ఉందని అభిప్రాయం
  • సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానన్న సీనియర్ నటుడు
  • కెరియర్‌లో చాలా తప్పులు చేశానని వెల్లడి  
సంక్రాంతికి విడుదలైన మహేశ్‌బాబు సినిమా గుంటూరు కారం బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫలితం ఇలా కావడం వెనకున్న కారణాన్ని సీనియర్ నటుడు జగపతిబాబు వివరించారు. గుంటూరు కారం సినిమాలో ఆయన విలన్‌గా కనిపించారు.

తాజాగా ఇంగ్లిష్ మీడియాతో జగపతిబాబు మాట్లాడుతూ సినిమా బోల్తా కొట్టడానికి గల కారణాన్ని వివరించారు. సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండడంతో గందరగోళం ఏర్పడిందని, కొన్ని పాత్రల్లో మార్పులు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తన పాత్ర వరకు తాను చేసినా సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పారు. మహేశ్‌బాబుతో చేసిన ‘శ్రీమంతుడు’ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని పేర్కొన్నారు. మహేశ్ సినిమాల్లో ఏ అవకాశాన్నీ తాను వదులుకోనని వివరించారు. 

తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను కొన్ని అనవసరమైన సినిమాలు చేశానని, కథను ఎంచుకోవడంలో పొరపాట్లు చేశానని పేర్కొన్నారు. తనకు కమర్షియల్ మైండ్ లేదన్నారు. ఈ తరహా సినిమాలే చేయాలన్న హద్దులేమీ లేవన్నారు. ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చేశానని, అలా చేయకపోయి ఉంటే నేడు ఇంకా మంచి స్థానంలో ఉండేవాడినని, అయినా, అందుకు తానేమీ బాధపడడం లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాలోనూ నటిస్తున్నారు.
Jagapathi Babu
Mahesh Babu
Guntur Kaaram
Tollywood

More Telugu News