Telangana: తెలంగాణ‌లో రూ.71.73 కోట్ల మేర నగదు, వస్తువుల స్వాధీనం

Cash and liquor valued at Rs 71cr seized so far in Telangana
  • రాష్ట్ర‌వ్యాప్తంగా పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ముమ్మ‌ర సోదాలు
  • భారీ మొత్తంలో నగదు, మద్యం, బంగారం స్వాధీనం
  • రూ. 29.31 కోట్ల నగదు, రూ. 9.54 కోట్ల విలువైన మ‌ద్యం ప‌ట్టివేత‌
  • రూ. 15.49 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌, రూ. 10.33 కోట్ల విలువ చేసే న‌గ‌లు స్వాధీనం
గత నెలలో ఎన్నిక‌ల‌ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ‌ వ్యాప్తంగా పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ముమ్మ‌రంగా సోదాలు నిర్వ‌హిస్తున్నాయి. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమ‌లులోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రూ.71.73 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న‌ట్లు సంబంధిత అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. దీనిలో భాగంగా గ‌త వారంలో రూ. 25.67 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన ఎన్నికల కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ఇప్పటివరకు రూ. 29.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి. ఈ నెల మొద‌టి వారంలోనే రూ.12.35 కోట్ల వ‌ర‌కు నగదు ప‌ట్టుబ‌డింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు రూ. 9.54 కోట్ల విలువైన 3.62 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో వారం రోజుల వ్యవధిలోనే రూ. 6.2 కోట్ల విలువైన మద్యం పట్టుబడటం గ‌మ‌నార్హం.

అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 15.49 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో పాటు ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న బంగారం, వెండితో పాటు ఇత‌ర‌ ఆభరణాల విలువ రూ. 10.33 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. అలాగే ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, చీరలు వంటి వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 7.04 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు. కాగా, తెలంగాణ‌లోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్న విష‌యం తెలిసిందే.
Telangana
Cash
Liquor
Election Code
Enforcement Directorate

More Telugu News