Praja Bhavan Accident Case: ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన కేసు: గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్న రాహిల్.. నోటీసులతో పోయేదానికి 15 మందిని అరెస్ట్!

BRS Ex MLA Shakeel Son Raheel Road Accident Case Now Went Serious
  • గతేడాది డిసెంబరు 23న అర్ధరాత్రి ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన రాహిల్ అహ్మద్
  • రాహిల్, ముగ్గురు యువతులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన వైనం
  • తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో మారిన సీన్
  • రాహిల్‌ను తప్పించే క్రమంలో ఇరుక్కుపోయిన 15 మంది కటకటాల్లోకి
  • రాహిల్ మెడకు చుట్టుకుంటున్న జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసు
  • తిరగదోడుతున్న పోలీసులు.. దర్యాప్తు షురూ
గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడమంటే ఇదేనేమో! గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి ప్రజాభవన్ దగ్గరున్న ట్రాఫిక్ బారికేడ్లను కారు ఢీకొట్టిన ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అహ్మద్ పరారయ్యాడు. నిజానికి ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టి ఉండేవారు. అయితే, తన తండ్రి పలుకుబడితో కేసును తుడిచేద్దామని భావించిన రాహిల్ మరింత లోతుగా ఇందులో ఇరుక్కోవడమే కాకుండా మరో 15 మంది జైలు ఊచలు లెక్కపెట్టుకునేలా చేశాడు. వీరిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు.

ఆ రోజున రాహిల్ బారికేడ్లను ఢీకొట్టడాన్ని విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. రాహిల్‌తోపాటు అందులో ఉన్న ముగ్గురు యువతుల్ని పట్టుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిజానికి ఈ కేసు ఇక్కడే ముగిసేది. రాహిల్ కు నోటీసులు ఇచ్చి, జరిమానా విధించి, హెచ్చరించి వదిలేసి ఉండేవారు.

తేడా కొట్టిందిలా
పోలీస్ స్టేషన్ నుంచి రాహిల్ తండ్రి షకీల్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ఆయన తన సమీప బంధువులు కొందరు, బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుతో వ్యవహారం నడిపించి రాహిల్ ను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. తెల్లవారకముందే రాహిల్ స్థానంలో మరొకరిని చేర్చారు. ఈ వ్యవహారం కాస్తా బయటకు రావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తులో షకీల్, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరో 12 మంది పాత్ర ఇందులో ఉన్నట్టు నిర్ధారణ అయింది. తొలుత మూడు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, ఆ తర్వాత 19 సెక్షన్లకు పెరిగింది. రాహిల్ ను కేసు నుంచి తప్పించే క్రమంలో మొత్తం 15 మంది జైలుపాలయ్యారు.

జూబ్లీహిల్స్ ప్రమాదం కేసులోనూ తెరపైకి రాహిల్ 
ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన కేసు విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండేళ్ల క్రితం జరిగిన కేసు కూడా తెరపైకి వచ్చింది. ఆ ఘటనలో కారు ఢీకొట్టి రెండు నెలల చిన్నారి మృతి చెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కూడా రాహిలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లోనూ కారు నడిపింది రాహిలేనని, తాజా కేసులో తన బదులు మరొకరిని లొంగిపోయేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కేసును కూడా తాజాగా బయటకు తీసి తిరిగి విచారణ చేపడుతున్నారు.
Praja Bhavan Accident Case
Raheel
Shakeel
BRS
Pujagutta Police Station
Crime News

More Telugu News