Himanta Biswa Sarma: లోక్ సభ ఎన్నికల తర్వాత మరికొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వస్తారు: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

More Congress leaders to join BJP in Assam says Himanta Biswa Sarma
  • రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర తర్వాతే ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయని వ్యాఖ్య
  • కులగణన, మణిపూర్ హింస గురించి రాహుల్ గాంధీ సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపాటు
  • రాహుల్ గాంధీకి అసోం సంస్కృతి తెలియదని... ప్రజలను విసిగించి వెళ్లిపోయారని విమర్శ
అసోంలో మరికొంతమంది కీలక కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత వారంతా పార్టీలోకి వస్తారన్నారు. ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర తర్వాతే ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కులగణన, మణిపూర్ హింస గురించి రాహుల్ గాంధీ సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు రోడ్లపై హడావుడి చేశారని, ఆయన తీరుతో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఇబ్బంది పడ్డాయన్నారు. అయితే అది తమకు మేలే చేసిందన్నారు. రాహుల్ గాంధీకి అసోం సంస్కృతి తెలియదని... ఇక్కడ ఎవరితోనూ మాట్లాడలేదని... కానీ ఇక్కడకు వచ్చి ప్రజలను విసిగించి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. మనం ఏ రాష్ట్రానికైనా వెళుతుంటే అక్కడి విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకోవాలని... అప్పుడే మాట్లాడాలన్నారు.

ఏం మాట్లాడాలి... ఏం మాట్లాడకూడదో తెలిసి ఉండాలన్నారు. సున్నితమైన అంశాలపై స్పష్టత ఉండాలన్నారు. రాహుల్ ప్రస్తావించిన కులాలు, మణిపూర్ అంశాలు అసోంలో ఏమాత్రం ప్రభావం చూపవన్నారు. రాష్ట్రంలో కుల వ్యవస్థ లేదన్నారు. ఇలాంటి రాష్ట్రంలో ఎవరో వచ్చి కులగణన అంటే ప్రజలు ఆమోదించరన్నారు. రాహుల్ గాంధీకి సహనం తక్కువ అని విమర్శించారు.
Himanta Biswa Sarma
Congress
BJP
Lok Sabha Polls

More Telugu News