USA: 99 ఏళ్ల భారతీయురాలికి అమెరికా పౌరసత్వం.. నెట్టింట పెల్లుబుకుతున్న ఆగ్రహం

  • భారత్‌కు చెందిన వృద్ధురాలు దాయి‌బాయ్‌కు అమెరికా పౌరసత్వం
  • అమె ఫొటోను ట్వీట్ చేస్తూ అమెరికా వలసల శాఖ హర్షం
  • పౌరసత్వం కోసం ఓ జీవితకాలం వేచి చూడాల్సి రావడంపై నెట్టింట ఆగ్రహం
99 yo indian woman gets american citizenship sparks debate

అమెరికాలో 99 ఏళ్ల భారతీయురాలికి పౌరసత్వం లభించడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పౌరసత్వం కోసం ఇంత సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని అనేక మంది వ్యాఖ్యానించారు. 

ఓర్లాండోలోని అమెరికా వలసల శాఖ దాయి‌బాయ్ అనే వృద్ధురాలికి పౌరసత్వం లభించిన విషయాన్ని ఇటీవల ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ‘‘వయసనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అంటారు. దాయి‌బాయ్ విషయంలో ఇది రుజువైంది. భారత్‌కు చెందిన దాయి‌బాయ్ ఇటీవలే అమెరికా పౌరసత్వ ప్రమాణం చేశారు’’ అని అమెరికా వలసల శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. దాయిబాయ్ కుమార్తె తమ కార్యాలయంలోనే పనిచేస్తోందని వెల్లడించింది. 

కాగా, ఈ ట్వీట్‌పై అనేక మంది సెటైర్లు పేల్చారు. కొందరు విచారం వ్యక్తం చేశారు. హెచ్-1బీ వీసాదారులు కొందరు తమ జీవితకాలంలో గ్రీన్ కార్డు పొందే పరిస్థితి కూడా లేదని నెటిజన్లు వాపోయారు. పసిపాపగా అమెరికాలో కాలుపెట్టిన దాయి‌బాయ్ వృద్ధాప్యంలో పౌరసత్వం పొందిందంటూ సెటైర్లు పేల్చారు. గ్రీన్ కార్డులు, పౌరసత్వం కోసం కొన్ని సందర్భాల్లో 150 ఏళ్లు కూడా వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఇటీవల కాలంలో అమెరికా వీసాల జారీలోనూ చాలా జాప్యం జరుగుతోందని కొందరు పేర్కొన్నారు.

More Telugu News