New york hijab: హిజాబ్ తొలగించిన న్యూయార్క్ పోలీసులు.. కోర్టుకెక్కి 17.5 మిలియన్ల పరిహారం పొందిన బాధితులు

New York to pay 17 million dollors for forcing women to remove hijabs for mugshots
  • నిబంధనలు అతిక్రమించారంటూ ఇద్దరు ముస్లిం మహిళల అరెస్టు
  • 2018లో జరిగిన ఘటనపై బాధితుల సుదీర్ఘ న్యాయ పోరాటం
  • పరిహారం ఇచ్చి కోర్టు బయట సెటిల్ చేసుకున్న న్యూయార్క్ పోలీస్ శాఖ
నేరస్థులకూ హక్కులు ఉంటాయని.. వాటిని అతిక్రమిస్తే పోలీసులైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరూపించే సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది. 2018లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తాజాగా రాజీకి వచ్చారు. బాధితులకు పరిహారం చెల్లించి కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు అంగీకరించారు. ఇందుకు గానూ భారీ మొత్తం.. 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించారు. మన రూపాయల్లో ఇది సుమారు 146 కోట్లు.. ఇదే సమస్యను ఎదుర్కొన్న బాధితులు అందరికీ ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. అంతేకాదు.. బాధిత మహిళలు కోర్టుకెక్కడంతో చట్టంలోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అసలేం జరిగిందంటే..
2018లో ఇద్దరు ముస్లిం మహిళలను న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అవి తప్పుడు ఆరోపణలని బాధిత మహిళలు చెప్పారు. అరెస్టు చేసిన తర్వాత జైలుకు పంపే ముందు నిందితులను ఫొటో తీయడం పోలీసు విధుల్లో ఓ భాగం. దీనిని మగ్ షాట్ అంటారు. ఇందుకోసం బాధిత మహిళల హిజాబ్ ను బలవంతంగా తొలగించారు. దీంతో తాను పోలీసుల ముందు నగ్నంగా నిలుచున్నట్లు అనిపించిందంటూ ఓ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. కేసు విచారణ జరుగుతుండగానే న్యూయార్క్ పోలీసులపై తన లాయర్ సాయంతో కేసు పెట్టింది.

తన మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోకుండా హిజాబ్ తొలగించి తీవ్రంగా అవమానించారని, తన మనోభావాలను దెబ్బతీశారని కోర్టులో వాదించింది. దీంతో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు మార్పులు చేశారు. మగ్ షాట్ కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించాల్సిన అవసరంలేదని, ముఖం కనిపించేలా ఉంటే సరిపోతుందని చెప్పారు. ఈ రూల్ మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్ ను విప్పాల్సిన అవసరంలేదని వివరించారు. సుదీర్ఘ న్యాయపోరాటంతో పోలీసులు దిగొచ్చి బాధిత మహిళలతో పాటు గతంలో ఇలా ఇబ్బంది పడ్డ వారికీ పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. సగటున ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది.
New york hijab
NPYD
17.5 million
Mugshot
Police Arrest
America

More Telugu News