Hardik Pandya: ఐపీఎల్‌లో వరుస పరాజయాలు.. సోమనాథ్ దేవాలయంలో హార్దిక్ పాండ్యా పూజలు

Amid IPL hustle Mumbais Hardik Pandya offers prayers at Somnath Temple
  • తాజా ఐపీఎల్ సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో హార్దిక్ పాండ్యా 
  • ఒడిదుడుకుల నేపథ్యంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన వైనం
  • సంప్రదాయ దుస్తుల్లో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాండ్యా 
ఐపీఎల్ మ్యాచుల హడావుడి నుంచి ఓ రోజు బ్రేక్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శుక్రవారం గుజరాత్‌లోని సోమనాథ దేవాలయాన్ని సందర్శించాడు. సంప్రదాయ దుస్తుల్లో అతడు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ దేవాలయానికి దేశం నలుమూలల నుంచి రోజూ భక్తులు మహాదేవుడి సందర్శనార్థం వస్తుంటారు.

హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తడబాటుకు లోనవుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ టీం కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకున్న పాండ్యా ముంబై ఇండియన్స్ విషయంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. 

తొలుత గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ ఆ తరువాత హైదరాబాద్ చేతిలోనూ పరాజయాన్ని చవి చూసింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఓ రేంజ్‌లో అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టేడియంలో అనేక సార్లు ప్రేక్షకులు హార్దిక్‌ను చూసి రోహిత్ శర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. 

ఇక, రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా   మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
Hardik Pandya
Somanath Temple
Gujarat
Mumbai Indians
IPL 2024

More Telugu News