Raghu Rama Krishna Raju: చంద్రబాబు వల్లే ఇవాళ ప్రాణాలతో ఉన్నాను: టీడీపీలో చేరిన అనంతరం రఘురామ భావోద్వేగం

Raghurama emotional speech in Palakollu
  • పాలకొల్లులో ప్రజాగళం సభ
  • టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు
  • చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యలు 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రజాగళం సభా వేదికపై రఘురామకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు. రఘురామను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు. 

"టీడీపీ అభిమానులకు, జనసేన అభిమానులకు, బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు. గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా, న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా, నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు. తొందరపడొద్దమ్మా... ఏమీ కాదు, నేను ఉన్నాను అని నా భార్యకు, నా కుమార్తెకు, నా కొడుకుకు ధైర్యం చెప్పారు. 

ఉన్నాను, విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెబుతారు... చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు. నా బాధ విన్నారు కాబట్టే... ఆయన ఇవాళ చెప్పినట్టు నేను మీ ముందు బతికున్నా. అందుకే చంద్రబాబుకు నేనెంతో రుణపడి ఉన్నాను. 

కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇవాళ చంద్రబాబు చొరవతో మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అతి త్వరలోనే జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారు.  

ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నాను. ఇందులో మోదీ బ్రహ్మ అయితే, విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరమశివుడు. మనమందరం సైనికులం... జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై నరేంద్ర మోదీ" అంటూ రఘురామ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు.

  • Loading...

More Telugu News