K Kavitha: కవితను జైల్లోనే విచారించేందుకు సీబీఐకి అనుమతి... నిబంధనలు వర్తిస్తాయి!

Delhi court allows CBI to question K Kavitha in excise policy case
  • కవితను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు
  • ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు
  • విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచన
ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. అంతకుముందు సీబీఐ తీహార్ జైల్లోనే కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. అందుకే ఆమెను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయనుంది.

ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించారు. కోర్టు అనుమతించడంతో వచ్చే వారం ఆమెను విచారించాలని సీబీఐ భావిస్తోంది. గతంలో నమోదు చేసిన స్టేట్‌మెంట్, అప్రూవర్‌గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది.

ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని, మద్యం విధానం రూపొందించిన ప్రయివేటు వ్యక్తులకు లబ్ధిచేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి బుచ్చిబాబు ఫోన్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించవచ్చునని తెలుస్తోంది. భూముల కొనుగోలు వ్యవహారంపై కూడా సీబీఐ దృష్టి సారించవచ్చునని తెలుస్తోంది.
K Kavitha
Delhi Liquor Scam
BRS
CBI

More Telugu News