YS Sharmila: షర్మిల బస్సు యాత్రలో వివేకా కూతురు సునీత.. అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపు

YS sunitha urges people of Kadapa to defeat YS Avinash Reddy
  • కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల
  • తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్న సునీత
  • షర్మిలను ఎంపీ చేయాలనేదే తన తండ్రి చివరి కోరిక అని వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ... కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపేశారని... హత్య చేసిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? అని ప్రశ్నించారు. షర్మిలను ఎంపీ చేయాలనేది తన తండ్రి చివరి కోరిక అని చెప్పారు. తన తండ్రి కోరిక నెరవేరాలంటే అవినాశ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. 

మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా వేసి ఇద్దరినీ కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ... జగన్, వైసీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టిన తనను జగన్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ తమకు దేవుడితో సమానమని... షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియంత జగన్ ను గద్దె దించాలని... కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని అన్నారు.
YS Sharmila
YS Sunitha Reddy
YS Vivekananda Reddy
Killi Kruparani
Congress
Jagan
YS Avinash Reddy
YSRCP

More Telugu News