YS Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలి: వైఎస్ షర్మిల

We must defeat Jagan and YS Avinash says Sharmila
  • కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల
  • వివేకా హత్య కేసు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపాటు
  • హంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని విమర్శ

కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని... ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో వివేకా కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే అన్నీ పూర్తయ్యేవని చెప్పారు.

  • Loading...

More Telugu News