Shashank Singh: పొరపాటున జట్టులోకి వచ్చి హీరోగా మారాడు.. పంజాబ్‌ను గెలిపించిన శశాంక్ సింగ్ ఎవరు?

Meet Shashank Singh Who become hero against Gujarat Titans
  • 29 బంతుల్లో 61 పరుగులు చేసి గుజరాత్‌పై పంజాబ్‌ను గెలిపించిన యువక్రికెటర్
  • దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గడ్‌కు ఆడుతున్న బ్యాటర్
  • ఐపీఎల్ వేలంలో ఇతడిని పొరపాటున దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
గురువారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు విజయవంతంగా ఛేదించింది. టార్గెట్ ఛేజింగ్‌లో నయా స్టార్ శశాంక్ సింగ్ వెలుగులోకి వచ్చాడు. కీలకమైన బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై శశాంక్ సింగ్ చెలరేగి ఆడాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చితక్కొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు బాది తన జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో అతడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.

పొరపాటున కొనుగోలు చేసిన ఆటగాడు...

శశాంక్ సింగ్ దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్ తరపున ఆడుతున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే వేరే ఆటగాడిని కొనుగోలు చేయబోయి పొరపాటున పంజాబ్ కింగ్స్ ఇతడిని దక్కించుకుంది. శశాంక్ అనే మరో క్రికెటర్‌ను తీసుకోబోయి కన్ఫ్యూజన్‌లో ఇతడిని కొనుగోలు చేసింది. 

ఈ ఆటగాడిని వదిలించుకోవాలని భావిస్తున్నామని ఐపీఎల్ వేలం నిర్వాహకుడు మల్లిక సాగర్‌ను కూడా పంజాబ్ కింగ్స్ సంప్రదించింది. ఇతడు తాము కొనుగోలు చేయాలనుకున్న ఆటగాడు కాదని అభ్యర్థించింది. అయితే అలా చేయడం సాధ్యంకాదని చెప్పడంతో శశాంక్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకుంది. ఈ విషయంపై ఎక్స్ వేదికగా కూడా పంజాబ్ క్లారిటీ ఇచ్చింది. గందరగోళానికి గురయ్యి ఇతడిని కొనుగోలు చేశామని, జట్టు విజయంలో భాగస్వామి అవుతాడని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ పోస్టుపై స్పందించిన శశాంక్ సింగ్.. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
Shashank Singh
Punjab Kings
Gujarat Titans
Cricket
IPL 2024

More Telugu News