Bojjala Sudheer Reddy: శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై హత్యాయత్నం.. కత్తితో వచ్చిన వ్యక్తిని పట్టుకున్న కార్యకర్తలు

Murder Attempt On Srikalahasti TDP Candidate Bojjala Sudheer Reddy
  • శ్రీకాళహస్తిలోని బహుదూరుపేటలో ప్రచారంలో ఉండగా ఘటన
  • సెల్ఫీ తీసుకుంటానంటూ కత్తితో వచ్చిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత
  • అతడిని వైసీపీ సానుభూతిపరుడు మహేశ్‌కుమార్‌గా గుర్తింపు
తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఓ వ్యక్తి ప్రయత్నించినట్టు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వైసీపీ సానుభూతిపరుడు మహేశ్‌కుమార్‌గా గుర్తించారు. శ్రీకాళహస్తిలోని ఐదో వార్డు బహుదూరుపేటలో సుధీర్‌రెడ్డి ప్రచారంలో ఉండగా ఆయనతో సెల్ఫీ దిగాలని ఉందని టీడీపీ శ్రేణులను మహేశ్‌కుమార్ అడిగాడు. అతడు మద్యం తాగి ఉండడంతో అనుమానించి పరిశీలించగా చేతిలో కత్తి ఉండడం గుర్తించి వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సుధీర్‌రెడ్డిని హత్య చేసేందుకే అతడు వచ్చాడంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మాత్రం బహుదూరుపేటలోని జాతరకు వచ్చానని చెబుతున్నాడు. మరి కత్తి ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం తన భద్రత కోసం అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.
Bojjala Sudheer Reddy
Srikalahasti
Telugudesam

More Telugu News