Punjab Kings: ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం

Punjab Kings beat Gujarat Titans in a thrilling encounter
  • 3 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన శిఖర్ ధావన్ సేన
  • బ్యాటింగ్‌లో చెలరేగిన శశాంక్ సింగ్, అశ్‌తోష్ శర్మ
  • 200 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలివుండగా ఛేదించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2024లో గురువారం రాత్రి మరో ఉత్కంఠ భరిత పోరు జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశ్‌తోష్ శర్మ అద్భుతంగా రాణించి జట్టుని విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కడ వరకు క్రీజులోనే ఉండి కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శశాంక్ సింగ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌కు అశ్‌తోష్ శర్మ చక్కటి సహకారం అందించాడు. 17 బంతుల్లో 31 పరుగులు రాబట్టాడు. విజయం లాంఛనం అయిన తర్వాత అశ్‌తోష్ ఔట్ అయినప్పటికీ మిగతా పనిని శశాంక్ పూర్తి చేశాడు. 

మిగతా పంజాబ్ బ్యాటర్ల విషయానికి వస్తే శిఖర్ ధావన్ (1), జానీ బెయిర్‌ స్టో (22) విఫలమయ్యారు. భారీ లక్ష్య ఛేదనలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించినా స్టార్ బ్యాటర్లు సామ్ కరణ్, జితేష్ శర్మ, సికందర్ రాజాలు తేలిపోయారు. ఈ సమయంలో శశాంక్ బౌలర్లపై చెలరేగిపోయాడు. సామ్ కరణ్ (5), సికందర్ రాజా (16), జితేశ్ శర్మ (16), హర్‌ప్రీత్‌ బ్రార్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఒమర్ జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మొహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ తీయగా.. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.

అంతకుమందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చెలరేగి ఆడాడు. 48 బంతుల్లో 89 పరుగులు బాదాడు. చివరిలో రాహుల్ తెవాటియా 8 బంతుల్లో కీలకమైన 23 పరుగులు రాబట్టాడు. దీంతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ముందు ఉంచగలిగింది. పంజాబ్ కింగ్స్‌ బౌలర్లలో కగిసో రబడా 2 వికెట్లు తీయగా, హర్‌ప్రీత్‌ బ్రార్‌, హర్షల్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ ఫలితంలో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో నిలిచాయి.
Punjab Kings
Gujarat Titans
IPL 2024
Shashank Singh
Cricket

More Telugu News