Rahul Gandhi: రాహుల్‌గాంధీ ఆస్తి రూ. 20 కోట్లు.. సొంత వాహనం మాత్రం లేదు!

Rahul Gandhi 20 Crore Assets Land Shared With Priyanka
  • నిన్న వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్‌గాంధీ
  • రాహుల్ వద్ద  రూ. 9.24 కోట్ల చరాస్తులు, రూ. 11.15 కోట్ల స్థిరాస్తులు
  • సోదరితో కలిసి ఢిల్లీలోని మొహరౌలిలో వ్యవసాయ భూమి
  • పోక్సో సహా పలు కేసులు నమోదైనట్టు వెల్లడి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి రూ. 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ, సొంత వాహనంగానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ లేదట. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేస్తున్న ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం రాహుల్ వద్ద రూ. 55 వేల నగదు, రూ. 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 4.33 కోట్ల బాండ్లు, షేర్లు, రూ. 3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ. 15.21 లక్షల గోల్డ్ బాండ్లు, రూ. 4.20 లక్షల విలువైన నగలు సహా రూ. 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి.

రాహుల్ రూ.11.15 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉంది. గురుగ్రామ్‌లో రూ. 9 కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

క్రిమినల్ కేసు కూడా
అత్యాచార బాధిత కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతోపాటు బీజేపీ నేతల ఫిర్యాదుపై పరువునష్టం కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించి నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదైనట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా సీపీఐ నేత అన్నీ రాజా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సుందరన్ బరిలో ఉన్నారు. కేరళలో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News