earth: భూమికి 700 కి.మీ. అడుగున భారీ మహాసముద్రం!

  • మహాసముద్రాలన్నింటిలో ఉండే నీటికన్నా 3 రెట్లు ఎక్కువ నీటి జాడ భూమి అడుగున గుర్తింపు
  • రింగ్ వుడైట్ అనే భారీ రాయిలో దాగి ఉన్న అతిభారీ జలాశయం
  • భూకంపాలపై అధ్యయనం చేస్తుండగా వెలుగులోకి ఆశ్చర్యకర పరిణామం
Gigantic Ocean Lies 700 Km Beneath Earths Surface

భూమి మూడు పొరలుగా ఉంటుందని.. వాటిని క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటారని మనం చదువుకున్నాం. తాజాగా పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. భూమికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఓ భారీ మహాసముద్రం ఉందని గుర్తించారు! ఈ వార్త ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ గా మారింది.

రాయిలో దాగిన నీరు!

రింగ్వుడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు.  మొత్తం భూమిపై ఉన్న మహాసముద్రాల్లో ఉన్ననీటి కంటే 3 రెట్లు ఎక్కువ నీరు అందులో ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే పేరుతో ఓ పరిశోధన పత్రంలో పొందుపరిచారు. రింగ్వుడైట్ ప్రత్యేక లక్షణాల గురించి అందులో వారు వివరించారు.

స్పాంజ్ లాగా రాయి నీటిని పీల్చుకుంటోంది
“రింగ్వుడైట్ రాయి ఒక స్పాంజిలాగా నీటిని పీల్చుకుంటోంది. దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉంది. హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుతోంది” అని ఈ పరిశోధన బృందంలో కీలకపాత్ర పోషించిన జియోఫిసిసిస్ట్ స్టీవ్ జాకబ్ సన్ చెప్పారు. మొత్తం భూమిపై నీటి చక్రం ఏర్పడటానికి గల ఆధారాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది భూమిపై భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందో తెలియజేపస్తుందన్నారు. భూమి పొరల్లో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం శాస్ర్తవేత్తలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.

భూకంపాల అధ్యయనంతో వెలుగులోకి..
వివిధ భూకంపాలపై అధ్యయనం చేపట్టిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడను కనుగొన్నారు. భూకంపాలను కొలిచే సీస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ ను గుర్తించడంతో  నీటి జాడ గురించి బయటపడింది. “భూమి మ్యాంటిల్ మార్పిడి జోన్ లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్థం భారీ నీటి జలాశయం ఉందన్నమాటే. మ్యాంటిల్ భాగంలో నిట్టనిలువునా పారే నీరు ఎండిపోవడానికి ఇది దారితీయొచ్చు” అని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

More Telugu News