YS Sunitha Reddy: వివేకా పీఏ కేసులో సునీత, ఆమె భర్తకు ఏపీ హైకోర్టులో ఊరట

High court stay on proceedings in case filed by Viveka former pa
  • తనను బెదిరిస్తున్నారంటూ 2021లో వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదు
  • సీబీఐకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ సునీత, ఆమె భర్త ఒత్తిడి చేశారని ఆరోపణ
  • ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలంటూ పులివెందుల పోలీసులకు మెజిస్ట్రేట్ ఆదేశం
  • మెజిస్ట్రేట్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన సునీత
  • ఈ కేసులో తదుపరి చర్యలు 4 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
వివేకా పీఏ కృష్ణా రెడ్డి దాఖలు చేసిన కేసు‌లో వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లకు మంగళవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి చర్యలను నాలుగు వారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి గతంలో పీఏగా పనిచేసిన కృష్ణా రెడ్డి 2021 డిసెంబర్‌లో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో పులివెందుల నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. సీబీఐకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు తమపై కేసులు నమోదు చేయడంతో సునీత, ఆమె భర్త, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్లపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా పీఏ ప్రైవేటు ఫిర్యాదును పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ యాంత్రిక ధోరణిలో పోలీసులకు పంపించారని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని పేర్కొంది. తదుపరి విచారణను 29కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
YS Sunitha Reddy
YS Vivekananda Reddy
Andhra Pradesh
CBI

More Telugu News