Sachin Tendulkar: 'నా చిన్న‌నాటి క‌ల.. నిజ‌మైన వేళ‌'.. 2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యంపై స‌చిన్ స్పెష‌ల్‌ ట్వీట్‌!

Sachin Tendulkar Reflects on 13th Anniversary of India 2011 Cricket World Cup Victory
  • భార‌త్‌ రెండోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి 13 ఏళ్లు అయిన సంద‌ర్భంగా 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన‌ సచిన్ 
  • ఆనాటి జ్ఞాపకాలు ఎప్ప‌టికీ మ‌దిలో నిలిచే ఉంటాయ‌న్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
  • కోట్లాది మంది అభిమానుల మ‌ద్ద‌తును కూడా ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనన్న క్రికెట్ గాడ్‌
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా రెండోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచింది. 2011, ఏప్రిల్ 2న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో భారత్ విజ‌యం సాధించింది. 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ భార‌త జ‌ట్టు రెండో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. భారత క్రికెట్ చ‌రిత్రలో అద్భుత‌మైన ఈ ఘ‌ట్టంపై మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట‌ర్) ఖాతా ద్వారా స్పందించారు.  

"స‌రిగ్గా ఇదే రోజున 13 ఏళ్ల క్రితం నేను చిన్న‌ప్పుడు క‌న్న క‌ల నిజ‌మైంది. ఆనాటి జ్ఞాపకాలు ఎప్ప‌టికీ నా మ‌దిలో నిలిచే ఉంటాయి. అలాగే నాతో పాటు ఆడిన జ‌ట్టు, కోట్లాది మంది అభిమానుల మ‌ద్ద‌తును కూడా ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను" అని క్రికెట్ గాడ్‌ స‌చిన్ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే.. 2011 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో స‌చిన్ టెండూల్క‌ర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా సెమీ ఫైన‌ల్‌లో దాయాది పాకిస్థాన్‌పై స‌చిన్ ఆడిన అద్భుత‌మైన‌ ఇన్నింగ్స్‌ను అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. అలాగే మ్యాచ్‌లో చివ‌రిగా సిక్స‌ర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ షాట్‌ను కూడా మ‌రిచిపోలేం.
Sachin Tendulkar
2011 Cricket World Cup
Team India
Sports News
Cricket

More Telugu News