AAP: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయరు: ఆప్ ప్రకటన

  • జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రకటించిన పార్టీ
  • తీహార్ జైలుకు తరలించిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ అధికార పార్టీ
  • మరో ఇద్దరు, ముగ్గుర్ని బీజేపీ టార్గెట్ చేసే అవకాశముందన్న ఆ పార్టీ సీనియర్ నేత
CM Arvind Kejriwal will not resign and he run government from jail says AAP

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలివ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక ప్రకటన చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని ఆ పార్టీ తెలిపింది. కేజ్రీవాల్‌కు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీ కీలక నేత జాస్మిన్ షా మీడియాతో మాట్లాడారు. 


ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయలేదని, తనకు బదులు మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లకు నివేదించాడని కేజ్రీవాల్ విచారణలో చెప్పారంటూ కోర్టుకు ఈడీ తెలపడంపై స్పందిస్తూ... ఇది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ అని జాస్మిన్ షా ఆరోపించారు. కేజ్రీవాల్‌ను జైలులో పెట్టినా పార్టీ చెక్కుచెదరకపోవడంతో వీరిద్దరిపై బీజేపీ గురిపెట్టిందని అన్నారు. తాను ముఖ్యమంత్రికి నివేదించబోనని అరెస్ట్ సమయంలోనే విజయ్ నాయర్ తెలిపాడని ప్రస్తావించారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లకు తాను రిపోర్ట్ చేస్తానని అప్పుడే చెప్పినప్పటికీ.. ఏడాదిన్నర తర్వాత ఈడీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతోందని ప్రశ్నించారు. అతిషి, సౌరభ్‌లతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులను బీజేపీ టార్గెట్ చేసుకునే అవకాశం ఉందన్నారు.

More Telugu News