new tax regime: నూతన పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు.. కేంద్రం స్పష్టీకరణ!

No new change Central Government issues clarification on new tax regime
  • మార్పులు జరిగినట్టుగా నడుస్తున్న ప్రచారంపై స్పందన
  • నూతన పన్ను విధానంలో ప్రయోజనాలను మరోసారి గుర్తుచేసిన కేంద్రం
  • చెల్లింపుదారులు తమకు ప్రయోజనకరమని భావించే విధానాన్ని ఎంచుకోవచ్చని వివరణ 

నూతన పన్ను విధానంలో ఏప్రిల్ 1 నుంచి పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. పన్ను విధానంలో కొత్తగా ఎలాంటి మార్పులు ప్రవేశపెట్టలేదని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త చెల్లింపుదార్లకు డిఫాల్ట్‌గా వర్తిస్తుందని, దీనికి సంబంధించిన అంచనా ఏడాది 2024-25గా ఉందని క్లారిటీ ఇచ్చింది. అయితే కంపెనీలు లేదా సంస్థలకు నూతన పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తించబోదని వివరించింది.

కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు గణనీయంగా తక్కువగా ఉంటాయని, అయితే ఇందులో పన్ను మినహాయింపులు, తగ్గింపుల ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయని ప్రస్తావించింది. వేతన జీవులకు రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ , ఫ్యామిలీ పెన్షన్‌పై రూ.15,000 వరకు పన్ను మినహాయింపు అందుబాటులో ఉండబోవని వివరించింది. ఇక నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా వర్తించనున్నప్పటికీ.. చెల్లింపుదారులు తమకు ప్రయోజనకరమని భావించే విధానాన్ని ఎంచుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. అంచనా ఏడాది 2024-25కి సంబంధించిన రిటర్నులను దాఖలు చేసే వరకు నూతన పన్ను విధానం నుంచి ఉపసంహరించుకొనే ఆప్షన్ అందుబాటులోనే ఉంటుందని తెలిపింది. 

వ్యాపార ఆదాయం లేకుండా అర్హత గల చెల్లింపుదార్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో తమ పన్ను విధానాన్ని మార్చుకోవచ్చని సూచించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని, ఆ తర్వాత సంవత్సరం పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఈ విధంగా ప్రతి ఏడాది మార్పు చేసుకునే సౌలభ్యం ఉందని స్పష్టం చేసింది. కాగా నూతన పన్ను విధానంలో రూ. 7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక ఆదాయం రూ.10 లక్షల వరకు ఉండి ఎలాంటి పెట్టుబడులు పెట్టనివారు తక్కువ పన్ను స్లాబ్‌ల రూపంలో ప్రయోజనాన్ని పొందవచ్చు.

  • Loading...

More Telugu News