Volunteers: వాలంటీర్లను ఈసీ నియంత్రిస్తుందని వైసీపీకి తెలుసు... అందుకే ఈ ప్లాన్!: పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల భాగ్య సూర్యలక్ష్మి

PCC General Secretary Akula Bhagya Surya Lakshmi slams YCP for volunteers issue
  • వైసీపీ పెన్షన్ రాజకీయాలకు పాల్పడుతోందన్న ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
  • పెన్షన్లకు రూ.1900 కోట్లు కావాలని వెల్లడి
  • కానీ, ఖజానాలో రూ.400 కోట్లు కూడా లేవని వ్యాఖ్యలు
  • వాలంటీర్లను ఎన్నికలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపణ
వైసీపీ పెన్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల భాగ్య సూర్యలక్ష్మి విమర్శించారు. వాలంటీర్లను ఎన్నికలకు ఉపయోగించుకోవాలని దురుద్దేశంతో వైసీపీ నేతలు వాలంటీర్లను రాజీనామాల బాట పట్టిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలల జీతం తామే ఇస్తామని చెబుతున్నారని, వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. 

"ప్రతి వాలంటీర్ వద్ద 50 ఇళ్లకు సంబంధించిన సేకరించిన సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీకి ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని, మళ్లీ మిమ్మల్ని తీసుకుంటాం అని వాలంటీర్లను నమ్మిస్తున్నారు. ఒక్కసారి రాజీనామా చేశారు అంటే... ఇక వాలంటీర్ కానట్లే... రాజీనామాలు చేసి వైసీపీ కోసం పని చేసిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. ఈ విషయం వాలంటీర్లు గుర్తించాలి. పైగా, చేసిన తప్పులకు కేసులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే వాలంటీర్లు తమ భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి. 

వాలంటీర్లను ఎలాగూ ఈసీ నియంత్రిస్తుందని తెలుసు కాబట్టి వృద్ధాప్య పెన్షన్లను లేటు చేసేందుకు వైసీపీ పెద్ద ప్రణాళికే వేసింది. సామాజిక పెన్షన్ల కోసం కనీసం రూ.1,900 కోట్లు కావాల్సి ఉంది. కానీ ఖజానాలో నాలుగైదు వందల కోట్లు కూడా లేవని తెలుసు అందుకే ఈ పెన్షన్ల రాజకీయం" అని ఆకుల భాగ్య సూర్యలక్ష్మి స్పష్టం చేశారు.
Volunteers
Pension
Akula Bhagya Suryalakshmi
PCC General Secretary
Congress
YSRCP
Andhra Pradesh

More Telugu News