Whatsapp Status: నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. యూపీ మహిళ వాట్సాప్ స్టేటస్

Wife Issues Tender for Killing Husband on Whatsapp status
  • వివాహం జరిగిన ఐదు నెలలకే భార్యభర్తల మధ్య గొడవ
  • పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్న భార్య
  • భార్య వాట్సాప్ స్టేటస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం.. భర్తపై కోపంతో అలిగి పుట్టింటికి వెళ్లే భార్య వారం పదిరోజుల తర్వాత తిరిగి రావడమూ అంతే సహజం. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మాత్రం భర్తను చంపించాలని చూసింది. దీనికోసం ఆమె ఏకంగా తన వాట్సాప్ స్టేటస్ లోనే సుపారీ ప్రకటించింది. తన భర్తను చంపిన వాళ్లకు రూ.50 వేల బహుమతి ఇస్తానని స్టేటస్ పెట్టుకుంది. ఇది చూసి భయాందోళనలకు గురైన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

గొడవకు కారణం..
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా భింద్ గ్రామానికి చెందిన యువతితో అదే జిల్లా బాహ్ బ్లాక్ కు చెందిన యువకుడికి 2022 డిసెంబర్ లో వివాహం జరిగింది. ఆ తర్వాత ఐదు నెలల పాటు భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. భార్యను ఇంటికి తీసుకురావడానికి భింద్ వెళ్లినపుడు అత్తామామలు తనను చంపేస్తానని బెదిరించారని భర్త పోలీసులకు చెప్పాడు. 

తన భార్యకు ఆమె పక్కింట్లో ఉండే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, తమ మధ్య గొడవకు కారణం కూడా ఇదేనని వివరించాడు. ఓవైపు కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగా.. మరోవైపు భార్య తరపు వాళ్ల నుంచి తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించాడు. తన భార్య ప్రియుడు కూడా ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు భార్యను, ఆమె తల్లిదండ్రులను విచారిస్తున్నారు.
Whatsapp Status
Kill Husband
UP wife
Agra
Uttar Pradesh
Crime News
Murder plot

More Telugu News