Phone Tapping Case: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. త్వరలో పలువురు ప్రముఖులకు నోటీసులు!

Phone tapping case police looking into sending notices to political personalities
  • పోలీసు వాహనాల్లో ఎన్నికల నిధుల తరలింపు జరిగిందని నిందితుల అంగీకారం
  • త్వరలో కొందరు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే ఛాన్స్
  • ఈ దిశగా న్యాయపరమైన అంశాలను చర్చిస్తున్న పోలీసులు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎన్నికల్లో నిధుల పంపిణీ కోసం పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్టు ఫోన్ ట్యాపింగ్ నిందితులు అంగీకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు కొందరు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందుతాయట. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హవాలా కోణం కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రణీత్ రావు ముఠా.. పలువురు ప్రజాప్రతినిధులు, హవాలా వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్భంగా నిందితులు ఈ విషయాలను అంగీకరించినట్టు సమాచారం. ఇక ప్రణీత్ రావు అందించిన సమాచారం ఆధారంగా అప్పట్లో కొందరు పోలీసులు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బు పట్టుకున్నారని పోలీసులు తాజాగా గుర్తించారు. మరోవైపు, ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు పంపిణీలో మరో అధికారి కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది.  

పోలీసు వాహనాల్లోనే పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నిధుల పంపిణీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాలు నిర్ధారించుకునేందుకు.. డబ్బులు అందుకున్నారని భావిస్తున్న వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సమాచారం. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై అధికారులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులు అందరినీ పిలిపించి విచారించేందుకు ఉన్న మార్గాలపై కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం. 

మరోవైపు, ఫోన్ ట్యాప్ చేసి తనను బెదిరించారని ఓ వ్యాపారి ఆదివారం బంజారాహిల్స్ రాణాకు వచ్చి దర్యాప్తు బృందాన్ని కలిశారు. ప్రస్తుత కేసులోని నిందితుడు ఒకరు తన ఫోన్ వాయిస్ రికార్డు చూపించి మరీ తనను బెదిరించారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Phone Tapping Case
Telangana
BRS
Congress

More Telugu News