TCS Company: టీసీఎస్ కంపెనీపై అమెరికన్ ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు

US Techies Allege TCS Fired Them To Hire Indians On H1B Visas
  • ఇండియన్ ఉద్యోగుల కోసం తమను తొలగిస్తోందని విమర్శలు
  • హెచ్ 1 బి వీసాతో తమ స్థానాలను భర్తీ చేస్తోందని మండిపాటు
  • టీసీఎస్ కంపెనీ చట్టాలను ఉల్లంఘిస్తోందన్న అమెరికన్ ఉద్యోగులు

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీపై అమెరికన్ ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేశారు. ఖర్చు తగ్గించుకోవడానికి టీసీఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతోందని, అమెరికన్ చట్టాలను అతిక్రమిస్తోందని ఆరోపించారు. తమను తొలగించి, తమ స్థానంలో ఇండియా నుంచి టెకీలను నియమించుకుంటోందని విమర్శించారు. హెచ్ 1 బి వీసా ద్వారా తాత్కాలికంగా నియామకాలు చేపడుతోందని మండిపడ్డారు. అమెరికాలో ఈ కంపెనీ ఉద్యోగులు మొత్తం 22 మంది ఇవే ఆరోపణలు చేశారు.

తమతో పోలిస్తే హెచ్ 1 బి ద్వారా పిలిపించుకునే ఉద్యోగులు తక్కువ వేతనానికే పనిచేస్తారనే దురాశతో కంపెనీ ఈ అనైతిక చర్యకు పాల్పడుతోందని అమెరికన్లు మండిపడుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు షార్ట్ నోటీస్ అందించి తమను ఇంటికి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఈక్వల్ ఎంప్లాయ్ మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (ఈఈఓసీ) వద్ద టీసీఎస్ పై ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. దేశంలోని దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో టీసీఎస్ కు పనిచేస్తున్న ఉన్నత విద్యావంతులను, సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపించిందని ఆరోపించారు.

ఇండియా నుంచి ఉద్యోగులను పిలిపించుకోవడంతో పాటు అమెరికాలోనే ఉంటున్న ఇతర హెచ్ 1 బి వీసా హోల్డర్లనూ నియమించుకుంటోందని చెప్పారు. కాగా, ఈ ఆరోపణలపై టీసీఎస్ కంపెనీ వివరణ ఇచ్చింది. టీసీఎస్ ఎన్నటికీ అనైతిక చర్యలకు పాల్పడదని, సమాన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా సరే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News