USA: పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌కి తొలిసారి లేఖ రాసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

  • ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించేందుకు నిరంతర మద్దతిస్తామని హామీ
  • ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య బంధాలు కీలకమన్న జో బైడెన్
  • అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పాకిస్థాన్ అధినేతను సంప్రదించిన అమెరికా అధినేత
US President Joe Biden wrote first letter to Pakistan Prime Minister Shebaz Sharif

పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచజనుల భద్రత కోసం ఇరు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యం కీలకమని బైడెన్ అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధిలో పాకిస్థాన్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని అన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, ప్రజల మధ్య సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పాకిస్థాన్‌లోని యూఎస్ ఎంబీసీ లేఖలోని విషయాలను వెల్లడించింది.

కాగా అమెరికా అధ్యక్షుడి హోదాలో పాక్ ప్రధానితో బైడెన్ జరిపిన తొలి అధికారిక సంభాషణ ఇదే కావడం గమనార్హం. 2021 జనవరిలో అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఇక 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవాజ్ షరీఫ్‌తోనూ బైడెన్ మాట్లాడకపోవడం గమనార్హం.

కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 90 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ బిలావల్ భుట్టో సారధ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా, పీపీపీ పార్టీ కో-ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడిగా ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

  • Loading...

More Telugu News