K Keshav Rao: బీఆర్ఎస్‌కు సీనియర్ నేత కె.కేశవ రావు గుడ్‌బై

Party General secretary K Keshav Rao says good bye to BRS
  • తన పూర్వ పార్టీ కాంగ్రెస్‌‌లోకి చేరబోతున్నానని ప్రకటన
  • తన కూతురు, హైదరాబాద్ మేయర్‌తో కలిసి హస్తంపార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడి
  • కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియా ముఖంగా ప్రకటన విడుదల చేసిన కేకే
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన కూతురు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 

కేసీఆర్‌ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనపై తనకూ గౌరవం ఉందని కేకే ఈ సందర్భంగా అన్నారు. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నానని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారని, తాను కూడా తన సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనుకుంటున్నానని కేశవరావు తెలిపారు. తాను సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నానని, ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని కేకే అన్నారు. తాను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్‌లోనేనని అన్నారు. 

తెలంగాణ ఉద్యమ నాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరానని కేకే అన్నారు. తాను ఆశించినట్టుగానే తెలంగాణ సిద్ధించిందని, కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ కోరికను నెరవేర్చిందని అన్నారు. 53 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశానని, బీఆర్ఎస్‌లో పదేళ్లే పని చేశానని అన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తనకు బాగా సహకరించారని, ప్రస్తుతం తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని, బీఆర్ఎస్‌లో యువతకు మరిన్ని అవకాశాలు రావాలని అన్నారు.

కాగా గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేకే భేటీ అయ్యారు. ఇరువురి భేటీపై కేకేపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. కేసీఆర్‌తో భేటీ అనంతరం కేకే తన నివాసానికి వెళ్లారు. పార్టీ మారబోతున్నట్టు మీడియా సమావేశంలో వెల్లడించారు.  బీఆర్ఎస్‌కు సంబంధించిన విషయాలపై కేసీఆర్‌తో మాట్లాడానని అన్నారు. కవిత అరెస్టుపై కూడా చర్చించుకున్నామని, ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చ జరిగిందని ప్రస్తావించారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగాలని తన కుమారుడు విప్లవ్‌ తీసుకున్న నిర్ణయం మంచిదేనని ఈ సందర్భంగా కేకే అన్నారు.
K Keshav Rao
BRS
Congress
TS Politics

More Telugu News