BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. వరంగల్ లోక్‌సభ పోటీ నుంచి వైదొలగిన కడియం కావ్య

Big shock for BRS as Kadiyam Kavya withdrawn from Warangal Lok Sabha seat
  • ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో జిల్లాలో పార్టీ బలహీనమైందన్న కావ్య
  • సమన్వయం లేకపోవడంతో తప్పుకుంటున్నట్టు ప్రకటన
  • కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం
  • తండ్రి కడియం శ్రీహరితో కలిసి హస్తం గూటికి చేరే ఛాన్స్

లోక్‌సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు 3 రోజుల క్రితమే కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఆమె ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పోటీ నుంచి వైదొలగుతున్నట్టు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు కావ్య లేఖ ద్వారా తెలియజేశారు.

గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కాం వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని లేఖలో కావ్య పేర్కొన్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే తాను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు కావ్య పేర్కొన్నారు. కేసీఆర్‌, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను క్షమించాలని ఆమె కోరారు. కాగా కావ్య తన తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కడియం కావ్య పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News