Nirmala Sitharaman: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

I have no money to contest Lok Sabha elections says Union Finance Minister Nirmala Sitharaman
  • పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరినా అందుకే తిరస్కరించానన్న బీజేపీ నేత
  • ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి సీటు ఇస్తామని జేపీ నడ్డా చెప్పారని వెల్లడి
  • ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2024’లో సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బీజేపీ నాయకత్వం కోరినా ఈ కారణంగానే తిరస్కరించానని ఆమె వెల్లడించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారని తెలిపారు. అయితే వారం, పది రోజులు ఆలోచించి పోటీ చేయడం తన వల్ల కాదని నిర్ణయించుకున్నానని, అదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని ఆమె చెప్పారు. పోటీ చేసేందుకు తన వద్ద అంత డబ్బు లేదని చెప్పానన్నారు. 

‘‘పోటీ చేసేది ఆంధ్రప్రదేశ్‌ అయినా.. తమిళనాడు అయినా అది నాకు సమస్యే. ఆ రాష్ట్రాల్లో గెలుపు ప్రమాణాలు నా విషయంలో ప్రశ్నార్థకమే. మీరు ఈ కులానికి చెందినవారా? లేక ఆ మతానికి చెందినవారా? మీరు దీనికి చెందినవారా? అనే ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకే నేను పోటీ చేయబోనని చెప్పాను. వీటన్నింటినీ ఎదుర్కోగలనని నేను భావించడం లేదు’’ అని సీతారామన్ అన్నారు. ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2024’లో ఆమె మాట్లాడారు.

బీజేపీ నాయకత్వం తన వాదనను అంగీకరించినందుకు కృతజ్ఞుతలు తెలిపానని, అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. దేశ ఆర్థిక మంత్రి వద్ద ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు ఎందుకు లేదని ప్రశ్నించగా.. భారత ప్రభుత్వానికి చెందిన ధనం తనది కాదని సమాధానమిచ్చారు. ‘‘ నా జీతం, ఆదాయం, పొదుపు మాత్రమే నావి. భారత ప్రభుత్వ నిధి నాది కాదు’’ అని ఆమె చెప్పారు.

ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆమె తెలిపారు. మీడియా కార్యక్రమాలకు హాజరవుతానని, అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్తానని ఆమె చెప్పారు.

కాగా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురు బీజేపీ నేతలు ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. పీయూష్ గోయెల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సూఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా ఈ జాబితాలో ఉన్నారు.
Nirmala Sitharaman
Lok Sabha Polls
Andhra Pradesh
Tamilnadu
BJP

More Telugu News