Kodali Nani: వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడతా.. నన్ను ఓడించడం చంద్రబాబు వల్ల కాదు: కొడాలి నాని

I am winning from Gudiwada says Kodali Nani
  • గుడివాడ నుంచి ఐదో సారి గెలవబోతున్నానని కొడాలి నాని ధీమా
  • తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శ
  • తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్

గుడివాడ నియోజకవర్గం నుంచి తాను ఐదోసారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని... వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెపుతున్నారని విమర్శించారు. 

తనను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్ విసురుతున్నానని... దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని అన్నారు. చంద్రబాబు 420 అనే విషయం గుడివాడ, చంద్రగిరి, పామర్రు ప్రజలకు తెలుసని చెప్పారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు తనను ఓడించలేరని అన్నారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీనే అని.. గుడివాడలో మళ్లీ గెలిచేది తానే అని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని... తాము ప్రజల్లోకి వెళ్లి ఇదే విషయం చెపుతామని అన్నారు.

  • Loading...

More Telugu News